రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(ఆరవ విడత)
51. విరియు సుమము బోలు గురుముఖమ్మున నుండి
విద్య యనెడు సుధను పీల్చునట్టి
తిమిర పూర జగతి దివ్వెయే విద్యార్థి -
విమల సుగుణ ధామ వేము భీమ.
52. దివ్వె తగులజేసి దివ్వెలెన్నైనను
వెలుగజేయవచ్చు సులువు గాను,
జ్ఞాన మిట్లె మనకు జగతిలో వ్యాపించు -
విమల సుగుణ ధామ వేము భీమ.
53. బ్రదుకు తెరువు కొఱకు చదువుకోవలె నీవు
అంత కన్న లబ్థి యెంతొ కలదు,
చదువుతోడ గొప్ప సంస్కార మేర్పడు -
విమల సుగుణ ధామ వేము భీమ.
54. బాహు బలము పెరుగు వ్యాయామముల తోడ,
బుద్ధి బలము పెరుగు విద్దె తోడ,
కండ కలిగి బుద్ధి కలవాడె మొనగాడు -
విమల సుగుణ ధామ వేము భీమ.
55. ప్రజ్ఞతోడ విద్య పణముగా పెట్టిన,
చేరవచ్చు భాగ్య శిఖరములను,
అడ్డులేదు దీని కావంత ధరలోన -
విమల సుగుణ ధామ వేము భీమ.
56. చిన్నతనము నందు స్నేహముల్ ముడివడు,
యెదిగి నపుడు గాని ముదిమి నైన,
మఱవ తరమె మిత్ర దరహాస దీప్తులు,
విమల సుగుణ ధామ వేము భీమ.
57. చదువుకొనెడు నాడు సాగును స్నేహంబు,
పేద గొప్ప యనక బింక మగుచు,
వృత్తిలోని మైత్రి ఉత్తుత్తిదే సుమ్ము!
విమల సుగుణ ధామ వేము భీమ.
58. మరగి మరగి పాలు మంటలో పడబోవ,
నీరుచేర్చ తిరిగి నిలిచి కాగు -
ఇలను మంచి స్నేహ మీ రీతి నుండురా!
విమల సుగుణ ధామ వేము భీమ.
59. కుటిల జనుడు పొగుడు గొప్పగా నీ ముందు
నీవు లేని తరిని నింద జేయు,
అట్టివాని నమ్ము టవివేకమేగదా!
విమల సుగుణ ధామ వేము భీమ.
60. ధర్మతత్పరతయు, దాక్షిణ్యమును లేని
బ్రదుకు బ్రతుక నేల పశువు వోలె?
బుద్బుదంబు గాదె భువిలోన మన జన్మ -
విమల సుగుణ ధామ వేము భీమ.