భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(ఏడవ విడత)
61. బ్రదుకు వ్యథలు క్రమ్మి బరువెక్క నీ బుర్ర,
ఇల్లు వదలి బైట కెళ్ళి చూడు,
ఎన్నిరెట్లు బాధ లున్నవో ధర లోన -
విమల సుగుణ ధామ వేము భీమ.
62. ఎండమావుల కొఱ కెందుకీ పరుగులు?
సుంత ఆగి శ్రమ నొకింత మఱువ
చుట్టు నున్న ప్రకృతి శోభను వీక్షించు!
విమల సుగుణ ధామ వేము భీమ.
63. ఉదయమందు లేచి ఉద్యానవన మేగి,
సుంత విచ్చి నట్టి సుమము చూడ,
కలుగు సంతసమ్ము తెలుపంగ తరమౌనె!
విమల సుగుణ ధామ వేము భీమ.
64. ముళ్ళమొక్క పీకి, పూలమొక్కను పెంచు,
మత్సరమ్ము నణచి మంచి పెంచు,
మంచి కన్న జగతి మించిన దేదిరా!
విమల సుగుణ ధామ వేము భీమ.
65. కలతతోడ మనసు కలగి కృశించిన,
విత్తి ఒక్క పూల విత్తనమ్ము,
పూయ బోవు పూల ముదముతో నూహించు -
విమల సుగుణ ధామ వేము భీమ.
66. పూయవచ్చు నొక్క పూవు నా తోటలో,
ఆదియె మదిని హాయి గూర్చు నాకు,
మంచి మిత్రుడొకడు పంచ నున్నట్లుగా -
విమల సుగుణ ధామ వేము భీమ.
67. చిత్తమందు నీవు చెత్తను పెంచకు,
తుడిచి వేయు మయ్య అడప తడప,
అద్దమంటి మనసు ఆరోగ్యమై యొప్పు -
విమల సుగుణ ధామ వేము భీమ.
68. అప్పుడప్పుడు మన కానంద మొదవిన
చెప్ప లేము నోరు విప్పి దాని,
అట్టి దాని నెఱుగు డనుభూతి యను పేర -
విమల సుగుణ ధామ వేము భీమ.
69. చిన్న కోర్కె తీర చెప్ప లేనంతగా
కలుగు సంతసమ్ము ఘనముగాను -
అవని లోని మనుజు డల్ప సంతొషిరా!
విమల సుగుణ ధామ వేము భీమ.
70. మంచి పాట విన్న మనసులో స్పందన
చెప్ప వలయు - కాక చెప్పకున్న
మూగ చెవిటి వారి ముచ్చటవలె నుండు -
విమల సుగుణ ధామ వేము భీమ.