భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(ఎనిమిదవ విడత)
71. కవిత లల్ల వచ్చు, ఘన కీర్తి గొన వచ్చు,
పేరు వచ్చి విలువ పెరుగ వచ్చు,
విర్రవీగ రాదు విబుధుడౌ కవిరాజు -
విమల సుగుణ ధామ వేము భీమ.
72. కవిత చెలగ వలయు కత్తివలె సమాజ
మలిన మెపుడు, ‘సర్జను’ల కఱకగు
‘స్కాలపెల్లు’ చెడిన కండ కోయు విధాన-
విమల సుగుణ ధామ వేము భీమ.
73. పద్య మెపుడు గూడహృద్యంబుగా నుండి
గొప్ప భావ మొకటి చెప్పవలయు,
కాని యెడల చూడ గద్యమే మేల్గాదె!
విమల సుగుణ ధామ వేము భీమ.
74. మెప్పు కొఱకు గాకగుప్పెడు తృప్తికై
కవిత వ్రాయు వారు కవులు భువిని -
కోరకున్న కూడ కూయదే కోకిల?
విమల సుగుణ ధామ వేము భీమ.
75. ఇల్లనంగ వసతి గృహముమాత్రమె కాదు,
వలపు చూర గొన్నవారి గూడి
నిచ్చలు బ్రదుకగల స్వేచ్ఛాప్రదేశంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.
76. ప్రేమయన్న నీవుప్రేమించు వారితో
పూర్ణ సంగమమ్ము, మోస మెఱుగ
నట్టి స్వార్థ రహితమైన తాదాత్మంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.
77. మగని పైన ప్రేమ, మమతానురాగమ్ము,
కలిసి మెలిసి బ్రదుకు కాంక్షయున్న
సాధ్వి నిర్వచనమ్ము సహధర్మచారిణి -
విమల సుగుణ ధామ వేము భీమ.
78. భార్యపైన ప్రేమ వాంచతో ముడివడు,
పిల్ల వాని పైన వృద్ధి కొఱకు,
తనయ పైన ప్రేమ ధరలోన సహజంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.
79. కుదురు లోని నారు ముదిరిన విడదీసి
వేరు చోట్ల నాట వృద్ధి పొందు -
పెరిగి నట్టి సుతులు విడిపోవుటయునట్లె
విమల సుగుణ ధామ వేము భీమ.
80. భార్య తోడ పిల్ల పాపల తోడను
కలసి అనుభవింప నలవి గాని
భాగ్య మెవరి కైన భాగ్య మెట్లౌనురా!
విమల సుగుణ ధామ వేము భీమ.