28, డిసెంబర్ 2011, బుధవారం

భీమ శతకం

భీమ శతకం
(3వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
21. ధరణిలోన రెండు తెఱగులు మూఢులు,
అమ్మనైన నమ్మనట్టివారు,
అడ్డమైన వారి నాదరించెడు వారు,
విమల సుగుణ ధామ వేము భీమ.

22. ఐనవారి కన్న మాకులందున పెట్టి,
కానివారి కిడును కంచమందు,
ముందు వెనుక లేని మూర్ఖశిఖామణి -
విమల సుగుణ ధామ వేము భీమ.

23. గమ్య మేది లేక కదలాడు నొక్కండు
గమ్యముండి కూడ కదల డొకడు
ఇంతకన్న మూర్ఖు లెందున గానము
విమల సుగుణ ధామ వేము భీమ.

24. పడగ విప్పి లేచి పన్నగంబుల వోలె
కడలి తరగ లెగిరి అడగిపోవు -
కండ పుష్టిలేని గాంభీర్య మింతియే
విమల సుగుణ ధామ వేము భీమ.

25. చేతగాని వాని చిత్తాన కొర్కెలు
పుట్టి చచ్చు గాని పొసగ వెపుడు -
వనధిలోన నలలు వచ్చి పోయెడు రీతి!
విమల సుగుణ ధామ వేము భీమ.

26. పనిని మొదలుపెట్ట ననుకూల సమయంబు
కాదటంచు టైము గడుపువాడు,
చేయలేడు దాని చిరకాల మాగినా!
విమల సుగుణ ధామ వేము భీమ.

27. తనకు నీవు చేయు పని పూర్తియైనంత
మొగము చాటుచేయు మోసకాడు,
మరల పనులు గలుగ తిరిగి పట్టును కాళ్ళు -
విమల సుగుణ ధామ వేము భీమ.

28. చిన్న చితక కొఱకు నిన్ను వేడెడు వాడు,
నీకు సేవకుండు , నేస్తమవడు -
కుక్క కాలు నాకు ముక్కకై కక్కూర్తి!
విమల సుగుణ ధామ వేము భీమ.

29. నిముష నిముషమందు నిన్ను పొగడు వాడు,
వందిగాని మిత్రు డెందు గాడు,
ఆరగింప వాని కాశ మెండుగ నుండు -
విమల సుగుణ ధామ వేము భీమ.

30. వృత్తిలోన నిన్ను హత్తి తిరిగెడువాడు,
మంచి మిత్రుడనుచు మభ్య పడకు,
దన్ను దొరికినంత వెన్నులో పొడుచురా!
విమల సుగుణ ధామ వేము భీమ.
సిలికానాంధ్ర వారి December, 2011 సుజనరంజని e-magazine కవితా స్రవంతి శీర్షికలొ ప్రచురితము.

భీమ శతకం

భీమ శతకం
(2వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

11. పట్టి పట్టి రోజు పైసైన జమ చేయ,
పెరిగి పెరిగి పెద్ద పెన్నిధౌను -
కూడి కూడి ఇసుక కొండగా మారదా!
విమల సుగుణ ధామ వేము భీమ.

12. నిద్ర గూడ వీడి నిరతమ్ము శ్రమియించి
ధనము కూడ బెట్టు మనుజు డెపుడు
నిధులు కూడి గూడ నిద్రించలేడురా -
విమల సుగుణ ధామ వేము భీమ!

13. ధనము కూడ బెట్ట తనువుతో ప్రాణమ్ము
పణము పెట్ట రాదు పవలు రేయి -
వ్యక్తి జీవితమ్ము వ్యాపారమా ఏమి ?
విమల సుగుణ ధామ వేము భీమ.

14. హాని జరుగు నేమొ అనుకుని మానకు
బ్రదుకు బాట యందు కదలు నపుడు -
మెడను సాచ కుండ మెదలునే తాబేలు?
విమల సుగుణ ధామ వేము భీమ.

15. చిక్కు లున్న పట్ల చీవాట్లతో గాక,
మంచి మాట తోడ మాన్ప వలయు -
అగ్ని నార్ప బోయి ఆజ్యంబు పోతురా!
విమల సుగుణ ధామ వేము భీమ.

16. పనులు రానివారు పని రాని వారితో
ఊసు లాడు చుందు రుబుసు పోక -
పనులు చేయు తరిని పలుకాడ వ్యవథేది?
విమల సుగుణ ధామ వేము భీమ.

17. యుద్ధ మందు తగులు పెద్ద దెబ్బలు గూడ
మాసి పోవు కాల మహిమ వలన -
మాసి పోని వెపుడు మన వారి దెప్పులే!
విమల సుగుణ ధామ వేము భీమ.

18. పప్పు తోడ బువ్వ చప్పగా నుండును
ఆవకాయ నంజ నద్భుతంబు -
బ్రదుకు లోని కొన్ని బాధలు తీపిరా!
విమల సుగుణ ధామ వేము భీమ.

19. పనిని చేరు నాడె ‘బాసు’కావలె ననుచు
చింత పడక పనులు చేయ వలెను,
‘రోము’ కట్టి నారె రొజులో తలపోయ!
విమల సుగుణ ధామ వేము భీమ!

20. పృథ్విలోన నెంత పెద్ద విద్యైనను
పట్టు పట్టి నేర్వ పవలు రేయి
కష్టమేమి కాక కరతలామలకమౌ!
విమల సుగుణ ధామ వేము భీమ!
సిలికానాంధ్ర వారి November, 2011 సుజనరంజని e-magazine కవితా స్రవంతి శీర్షికలొ ప్రచురితము.

భీమ శతకం

భీమ శతకం
(1వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం
1. ఇంద్ర ధనసు చెలువ మింపుగా వీక్షింప
వాన యందు కొంత నాన వలయు
ఒళ్ళు వంచ కుండ ఒరుగునే భాగ్యంబు!
విమల సుగుణ ధామ వేము భీమ!

2. ముక్కుమూసుకొనుచు మూల కూర్చున్నచో
దొరకబోదు సిరియు హరికినైన
జలధి తరచకుండ జన్మించెనే లక్ష్మి!
విమల సుగుణ ధామ వేము భీమ!

3. బ్రదుకు పందెమందు పరిగెత్త వలె – చేత
నైన వేగమునను, లేని యెడల
ఎక్కడుంటివొ మునుపక్కడే యుందువు -
విమల సుగుణ ధామ వేము భీమ!

4. రేయి పవలు తాను రెట్టించి పని జేయ
పిలిచి ఇచ్చు ‘బాసు’ పెత్తనమ్ము,
పెత్తనమ్ము తోడ పెరుగును పని గూడ,
విమల సుగుణ ధామ వేము భీమ!

5. పిన్న నాటనుండి చెమటోడ్చి కష్టించి,
పొదుపుచేసి సుఖము పొందు తరిని,
కష్టపడుటె వాని కిష్టమై పోవురా!
విమల సుగుణ ధామ వేము భీమ!

6. ఉన్న ధనముతోడ నుల్లసిల్లని వాడు,
ఎంత వచ్చి పడిన శాంతి పడడు -
అగ్ని కెంత తిన్న ఆకలి తీరునా!
విమల సుగుణ ధామ వేము భీమ!

7. దుడ్డు కొరకు నీవు దొడ్డి దారులు పట్ట,
దొరక వచ్చు పరువు పెరుగ వచ్చు -
ఆత్మ యందు శాంతి అంతరించును దాన,
విమల సుగుణ ధామ వేము భీమ!

8. పుణ్యుడౌట వీడు పొందె సంపదటంచు
ననగరాదు - ఎరుగు మతని గాథ,
పవలు రేయి తాను పని చేసె కష్టించి,
విమల సుగుణ ధామ వేము భీమ!

9. హంస నీట పయన మందమ్ముగా దోచు,
కాళ్ళు పడెడి బాధ కాన బడదు -
సొమ్ము లున్న వాని సోకిట్టులుండురా!
విమల సుగుణ ధామ వేము భీమ!

10. ధనము లేనివాడు ధరలొన కొరగాడు,
అమ్మకైన గాని ఆలి కైన,
సొమ్ములున్న ప్రజలు చుట్టూత తిరుగరే
విమల సుగుణ ధామ వేము భీమ!
సిలికానాంధ్ర వారి October, 2011 సుజనరంజని e-magazine కవితా స్రవంతి శీర్షికలొ ప్రచురితము.