28, డిసెంబర్ 2011, బుధవారం

భీమ శతకం

భీమ శతకం
(3వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
21. ధరణిలోన రెండు తెఱగులు మూఢులు,
అమ్మనైన నమ్మనట్టివారు,
అడ్డమైన వారి నాదరించెడు వారు,
విమల సుగుణ ధామ వేము భీమ.

22. ఐనవారి కన్న మాకులందున పెట్టి,
కానివారి కిడును కంచమందు,
ముందు వెనుక లేని మూర్ఖశిఖామణి -
విమల సుగుణ ధామ వేము భీమ.

23. గమ్య మేది లేక కదలాడు నొక్కండు
గమ్యముండి కూడ కదల డొకడు
ఇంతకన్న మూర్ఖు లెందున గానము
విమల సుగుణ ధామ వేము భీమ.

24. పడగ విప్పి లేచి పన్నగంబుల వోలె
కడలి తరగ లెగిరి అడగిపోవు -
కండ పుష్టిలేని గాంభీర్య మింతియే
విమల సుగుణ ధామ వేము భీమ.

25. చేతగాని వాని చిత్తాన కొర్కెలు
పుట్టి చచ్చు గాని పొసగ వెపుడు -
వనధిలోన నలలు వచ్చి పోయెడు రీతి!
విమల సుగుణ ధామ వేము భీమ.

26. పనిని మొదలుపెట్ట ననుకూల సమయంబు
కాదటంచు టైము గడుపువాడు,
చేయలేడు దాని చిరకాల మాగినా!
విమల సుగుణ ధామ వేము భీమ.

27. తనకు నీవు చేయు పని పూర్తియైనంత
మొగము చాటుచేయు మోసకాడు,
మరల పనులు గలుగ తిరిగి పట్టును కాళ్ళు -
విమల సుగుణ ధామ వేము భీమ.

28. చిన్న చితక కొఱకు నిన్ను వేడెడు వాడు,
నీకు సేవకుండు , నేస్తమవడు -
కుక్క కాలు నాకు ముక్కకై కక్కూర్తి!
విమల సుగుణ ధామ వేము భీమ.

29. నిముష నిముషమందు నిన్ను పొగడు వాడు,
వందిగాని మిత్రు డెందు గాడు,
ఆరగింప వాని కాశ మెండుగ నుండు -
విమల సుగుణ ధామ వేము భీమ.

30. వృత్తిలోన నిన్ను హత్తి తిరిగెడువాడు,
మంచి మిత్రుడనుచు మభ్య పడకు,
దన్ను దొరికినంత వెన్నులో పొడుచురా!
విమల సుగుణ ధామ వేము భీమ.
సిలికానాంధ్ర వారి December, 2011 సుజనరంజని e-magazine కవితా స్రవంతి శీర్షికలొ ప్రచురితము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి