28, డిసెంబర్ 2011, బుధవారం

భీమ శతకం

భీమ శతకం
(1వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం
1. ఇంద్ర ధనసు చెలువ మింపుగా వీక్షింప
వాన యందు కొంత నాన వలయు
ఒళ్ళు వంచ కుండ ఒరుగునే భాగ్యంబు!
విమల సుగుణ ధామ వేము భీమ!

2. ముక్కుమూసుకొనుచు మూల కూర్చున్నచో
దొరకబోదు సిరియు హరికినైన
జలధి తరచకుండ జన్మించెనే లక్ష్మి!
విమల సుగుణ ధామ వేము భీమ!

3. బ్రదుకు పందెమందు పరిగెత్త వలె – చేత
నైన వేగమునను, లేని యెడల
ఎక్కడుంటివొ మునుపక్కడే యుందువు -
విమల సుగుణ ధామ వేము భీమ!

4. రేయి పవలు తాను రెట్టించి పని జేయ
పిలిచి ఇచ్చు ‘బాసు’ పెత్తనమ్ము,
పెత్తనమ్ము తోడ పెరుగును పని గూడ,
విమల సుగుణ ధామ వేము భీమ!

5. పిన్న నాటనుండి చెమటోడ్చి కష్టించి,
పొదుపుచేసి సుఖము పొందు తరిని,
కష్టపడుటె వాని కిష్టమై పోవురా!
విమల సుగుణ ధామ వేము భీమ!

6. ఉన్న ధనముతోడ నుల్లసిల్లని వాడు,
ఎంత వచ్చి పడిన శాంతి పడడు -
అగ్ని కెంత తిన్న ఆకలి తీరునా!
విమల సుగుణ ధామ వేము భీమ!

7. దుడ్డు కొరకు నీవు దొడ్డి దారులు పట్ట,
దొరక వచ్చు పరువు పెరుగ వచ్చు -
ఆత్మ యందు శాంతి అంతరించును దాన,
విమల సుగుణ ధామ వేము భీమ!

8. పుణ్యుడౌట వీడు పొందె సంపదటంచు
ననగరాదు - ఎరుగు మతని గాథ,
పవలు రేయి తాను పని చేసె కష్టించి,
విమల సుగుణ ధామ వేము భీమ!

9. హంస నీట పయన మందమ్ముగా దోచు,
కాళ్ళు పడెడి బాధ కాన బడదు -
సొమ్ము లున్న వాని సోకిట్టులుండురా!
విమల సుగుణ ధామ వేము భీమ!

10. ధనము లేనివాడు ధరలొన కొరగాడు,
అమ్మకైన గాని ఆలి కైన,
సొమ్ములున్న ప్రజలు చుట్టూత తిరుగరే
విమల సుగుణ ధామ వేము భీమ!
సిలికానాంధ్ర వారి October, 2011 సుజనరంజని e-magazine కవితా స్రవంతి శీర్షికలొ ప్రచురితము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి