30వ నవంబరు 2012 నాడు హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో రసమయి సంస్థవారి ద్వితీయ బృహత్ వాఙ్మయ మహాకవి శ్రీ దాశరథి పురస్కారం, జ్ఞానఫీఠ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు, దాదాసాహేబు ఫాల్కె అవార్డు గ్రహీత, అక్కినేని నాగేశ్వరరావు గార్ల చేతులమీదుగా ఆచార్య వి. యల్.యస్. భీమశంకరం గారికి బహూకరింపబడిన సందర్భంగా సభలో భీమశంకరం గారు చదివిన పద్యం:
అలయకుండనె నాకు అపురూప విద్యల కరతలామలకంబు గరపినావు,
భూరిశాస్త్రములందు భూభౌతికమునందు వాసికెక్కిన ప్రోడ చేసినావు,
వివిధ దేశములందు విజ్ఞాన సభలలో శంఖంబు పూరింప సలిపినావు,
ఆచార్య వృత్తిలో అధిక మన్ననలంది ఎనలేని ఖ్యాతి పొందించినావు,
ప్రౌఢ రసస్రువు గ్రంథ రచన యందు అలఘు చందోనాట్య మాడినావు,
నేడు నా మ్రోల నలువుగా నిలువుమమ్మ,
ద్వాదశాదిత్య కవిజన వాఙ్మయ సభ
భ్రాజిత రవీంద్ర భారతీ ప్రాంగణమున,
చతుర పద గణ సుమ లాస్య శారదాంబ!