5, జనవరి 2012, గురువారం

తెలుగు వారము మేము

తెలుగు వారము మేము
ఛందస్సు: ద్విరదగతి రగడ

రచన: ఆచార్య వి. ఎల్. ఎస్. భీమశంకరం.

తెలుగు వారము మేము, తెలుగు జాతియె వెలుగు,
తెలుగన్న మాకెన్నొ తీపి తలపులు గలుగు,
ఏ దేశమందున్న, ఏ చోట కేగినా
ఏ దారి నడచినా, ఎంతెత్తు కెదిగినా, 4

ఆశ మా కెప్పుడూ అందాల తెలుగన్న,
దేశభాషల లోన తెలుగు లెస్సేనన్న,
మాతృ భాషను వదలి మనలేము మేమెన్న,
భాతృజన మన్నచో భక్తి భావము మిన్న - 8

తెలుగు కీర్తిని తలచి, తెలుగు సంస్కృతి నుంచి
నలువైన శబ్దముల లలితముగ వెలయించి,
కవనములు రచయించి, ఘనరవము వహియించి,
చవులూర పాడించి, భువినెల్ల అలరించి, 12

పలు బాస లెరిగినా తెలుగులో భాషించి,
వెలయించి మధురిమలు, కిల కిలా రవళించి,
అలరులను విరియించి అందరికి వినిపించి
వెలుగు చూపెదమింక, యెలుగెత్తి చాటించి - 16

మిగత వారిని గాంచి, మిగుల గౌరవముంచి,
ప్రగతి వారికి పంచి, బ్రతుకు విలువలు పెంచి,
జగలంబు నలి చేసి, జగడంబు వెలి వేసి,
సగటు మానవు వాసి సమృధ్ధిగా చేసి, 20

అగచాట్లు తగ్గించి, అమృతంబు పండించి,
జగతి స్వర్గము చేసి జాగృతిని హెచ్చించి,
తెలుగు సంస్కృతి శోభ నలువురూ గుర్తింప,
విలువలను పెంచెదము విఖ్యాతి వ్యాపింప. 24

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి