4, జనవరి 2012, బుధవారం

భీమ శతకం

భీమ శతకం
(4వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

31. శిష్యు డనుచు చేరి సేవ లెన్నియొ చేసి,
కొల్లగొట్టు గృహము కుత్సితుండు,
అతని పేరె తెలియు మాషాఢభూతిగా!
విమల సుగుణ ధామ వేము భీమ.

32. చేప కొఱకు కొంగ చేరి యుండును నీట
కదలకుండ నొంటికాలిమీద -
కోర్కి దీరు దనుక కుత్సితు డిట్లుండు!
విమల సుగుణ ధామ వేము భీమ.

33. ఎదురు నిల్చి మనల నెదిరించు వైరితో
నేర్పు తోడ పోరి నెగ్గవచ్చు,
నీడ నుండి పోరు నేస్తగాడె సమస్య!
విమల సుగుణ ధామ వేము భీమ.

34. అల్పులున్న చోట అధికు లుండగ రాదు,
తరలి వారి నుండి తలగ వలయు -
కాకు లఱచు చోట కోకిల నిలుచునా!
విమల సుగుణ ధామ వేము భీమ.

35. పనులు లేని వారు పనిరాని వారితో,
ఊసు లాడు చుందు రుబుసుపోక,
పనులు చేయు తరిని పలుకాడ వ్యవథేది?
విమల సుగుణ ధామ వేము భీమ.

36. అల్పుడైన మనుజు డనుమానములతోడ
కాలమును వృథాగ గడుపు చుండు
చేతనున్న పనిని చేపట్టగా మాని -
విమల సుగుణ ధామ వేము భీమ.

37. ధనము లేని వాడు ధరలోన కొఱగాడు,
అమ్మకైన గాని ఆలికైన,
సొమ్ములున్న జనులు చుట్టూత తిరుగరే!
విమల సుగుణ ధామ వేము భీమ.

38. కోరుకున్న వన్ని కో యన్ననే వచ్చు,
కొండమీద నుండు కోతియైన -
సొమ్ములున్నవాడె శోభిల్లు నెచటైన,
విమల సుగుణ ధామ వేము భీమ.

39. బంతివోలె నెగిరి బ్రదుకు పథములందు
పామరుండు క్రింద పడుచునుండు,
శూరు డెపుడు ప్రగతి సోపానముల నెక్కు -
విమల సుగుణ ధామ వేము భీమ.

40. ధనము కొఱకు వారు తప్పు దారులు పట్టి,
ధనము మాకు వలదు ధ్వస్త మనుచు,
గొప్పగా బడాయి చెప్పుచుందురు నేడు!
విమల సుగుణ ధామ వేము భీమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి