భీమ శతకం
(5వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(5వ విడత)
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
41. ఉద్భవించరు జను లూరక కూర్చుండ -
చేతనైన మేలు చేయు కొఱకు
పుట్టుచుందు రిలను పుణ్య మూలమ్మున -
విమల సుగుణ ధామ వేము భీమ.
42. బ్రతుకు లోన నిరత మతిశయిల్లెడు కోర్కె
సహజ గుణము మేటి జనుల కెపుడు,
గొప్ప పొందుట కొఱ కెప్పుడూ కాదయా -
విమల సుగుణ ధామ వేము భీమ.
43. దీప్తి పంచ జగతి దీపించి క్రొవ్వొత్తి
కరగి పోవు గాదె పరుల కొఱకు
సజ్జనుండు గూడ సరిగ నిట్లుండురా
విమల సుగుణ ధామ వేము భీమ.
44. జగతి యందు ప్రగతి సాధ్య మయ్యెను నేడు
వివిధ దేశ శాస్త్రవిదుల వలన
వందనమ్ము సేతు వారి కనుదినమ్ము -
విమల సుగుణ ధామ వేము భీమ.
45. తరతరాల నుండి కష్టించి కృషి చేసి
ధిషణవరులు తీర్చి దిద్దినారు
జగతి ప్రగతి వారి సంకీర్ణ యత్నంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.
46. శాంతి గలుగు జనుడె సంతొషవంతుండు,
ఆశ లేని జీవి ఆత్మ విదుడు,
ఎంచి చూడ వారికే వంతలుండవు -
విమల సుగుణ ధామ వేము భీమ.
47. నాల్గు మోము లున్న నలువ కైనను గాని
వాణి నాల్కయందు వాస ముండు -
విద్య లేని యెడల విలువేది విధికైన!
విమల సుగుణ ధామ వేము భీమ.
48. చదువు నేర్చుటన్న జ్ఞాన సంపాదనే,
మనిషి ఎదుగుదలకు, మనుగడకును,
భోగ భాగ్యములకు ముఖ్య సొపానమ్ము -
విమల సుగుణ ధామ వేము భీమ.
49. చదువుకొన్న వారి సాంకేతికత పైన
సంఖ్య పైన, వారి శక్తి పైన
అవని జనుల ప్రగతి ఆధార పడి యుండు -
విమల సుగుణ ధామ వేము భీమ.
50. చదువుకొన్న వారి సంఖ్య తగ్గెను నేడు,
చదువు ‘కొనెడు’ వారి సంఖ్య పెరిగె!
ఆపుడయ్య చదువులమ్మ నమ్ముకొనుట -
విమల సుగుణ ధామ వేము భీమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి