10, నవంబర్ 2012, శనివారం

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదునైదవ విడత)

141.   ఈత నేర్పు తరిని ఈతపై పాఠంబు
          చెప్ప వలను లేదు గొప్పగాను,
          నేర్పు తోడ వాని నీట త్రోసిన చాలు!
          విమల సుగుణ ధామ వేము భీమ.

142.   వయసు తోడ తెలివి పెరుగునా మనిషికి?
          పెరుగ వేమిగూడ తఱుగు గాని
          ముఖము పైన నుండు ముడుత లొక్కటి తక్క -
          విమల సుగుణ ధామ వేము భీమ.               

143.   పుట్టినపుడు మనిషి మూర్ఖుడై పుట్టడు,
          పెరుగు నపుడు వాడు పరుల జూచి
          ఎన్ని ఏండ్లొ నేర్చి ఇట్లౌను శ్రమియించి -
          విమల సుగుణ ధామ వేము భీమ.
 
144.   న్యూసు పేపరెంత నూరి మ్రింగిన గాని,
          కలుగ బోదు తెలివి ఖలున కెపుడు  -
          కాగితాలు నమలి కవి యౌనె ఖర మెన్న? 
          విమల సుగుణ ధామ వేము భీమ.

145.   భార్య తోడ నీవు బ్రతుకు టెట్లన్నచో,
          తప్పు చేసి నప్పు డొప్పు కొనుము,
          భార్య తప్పు చేయ పన్నెత్త బోకుము!                                                          
          విమల సుగుణ ధామ వేము భీమ.

146.   ప్రేమ యనగ నేడు పెద్ద గాలంబయ్యె ,
          చిక్కె నేని పెద్ద చాప చిక్కు,
          చిక్క కున్న గూడ చిత్రమౌ ‘టైంపాసు’ -
          విమల సుగుణ ధామ వేము భీమ.

147.    దుడుకు తోడ వాడు దుప్పటీ విసిరెను
           శీతకాల మనెడి చింత లేక, 
           పడచు భార్య తనకు ప్రక్క నున్నది గాన -
           విమల సుగుణ ధామ వేము భీమ.

148.    కనుల బడడు మనకు కాయజుం డెచ్చోట,
           అయిన వాడు చేయు ఆగడమ్ము
           లెంచిచూడ నెడద నిన్నిన్ని గాదయా!
           విమల సుగుణ ధామ వేము భీమ.

149.    “అమ్మ ఒడిని మరల నాదమఱచి హాయి
           నిద్రపోవ తలతు నేను!  కాని
           అడ్డ మయ్యె నాకు గెడ్డ మొక్కటి నేడు” -
           విమల సుగుణ ధామ వేము భీమ.

150.    పైకి క్రింది కెపుడు పరిగెత్తు నెయ్యది,
           ఆగి పోవ కదల కాగు నెద్ది?
          ‘సెక్రెటేరియట్టు సీక్రెట్టు ఫైలు’రా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

151.   భరత దేశమందు ప్రభవించుటే గొప్ప!
          తెలుగు మాతృభాష గలుగ గొప్ప!
         భారతీయత మన బ్రదుకు  నింపుటె గొప్ప!
         విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదునాల్గవ విడత)

131.    జీవితాన సగటుజీవి చేసెడు తప్పు,
           తప్పు చేతు ననెడు తలపు తోడ
           బాధ పడుచు సతము బ్రతుకుటే తలబోయ  -
           విమల సుగుణ ధామ వేము భీమ.

132.    భావి కొఱకు నీవు బాధతో కుందుచు,
           వర్తమాన మందు బ్రదుక మఱచి,
           రెంటికి చెడినట్టి రేవడై పోకుము  -
           విమల సుగుణ ధామ వేము భీమ.

133.    జరిగినవి జరిగెను - చర్చ చేయగ నేల,
           జరుగ బోవు నవియు జరుగ వేమొ? 
           జరుగ నట్టి వాటి  కొఱకెందుకో చింత! 
           విమల సుగుణ ధామ వేము భీమ.

134.    ప్రక్క ఇంటి వాని భార్య రూపసి యంచు
           పొగడనట్టి భర్త భువిని అరుదు -
           పుల్లనైనను రుచి పొరుగింటి గోంగూర!
           విమల సుగుణ ధామ వేము భీమ.

135.    దూరమందు గిరులు సౌరుగా తోచును, 
           చెంత కేగ గట్లు గుంత లుండు  -
           పొరుగువాని భాగ్య భోగ్యంబు లిట్లురా!
           విమల సుగుణ ధామ వేము భీమ.

136.    పనిని పూర్తి చేయ పట్టి ప్రయత్నించు,
           గెలువ నంత మాత్ర తొలగ బోకు,
           అదియె మొదటి యత్న మనుకొని సాగరా -                
           విమల సుగుణ ధామ వేము భీమ.

137.   యుద్ధమందు తగులు పెద్ద దెబ్బలు గూడ,
          మాసిపోవు కాల మహిమ వలన,
          మాసిపోని  వెపుడు మనవారి దెప్పులే!
          విమల సుగుణ ధామ వేము భీమ.

138.   నీరు జలధి నున్న నింగిపై కెగురును
          హస్త మందు గొన్న నడగి యుండు  -
          స్థాన బల్మి గాని తన బల్మి కాదయా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

139.   మంచి జరుగు నాడు మారాజు ననుకోకు, 
          కీడు జరుగు నపుడు క్లేశ పడకు,
          కష్ట  సుఖము లెపుడు కావడి కుండలే -
          విమల సుగుణ ధామ వేము భీమ.

140.   కొన్ని పుస్తకాలు కొని చదువ వలయు,
          కొన్ని అరువు తెచ్చి, కొన్ని ‘బుక్సు’
          చిత్తగించ బోకు డుత్తినే ఇచ్చినా  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదమూడవ విడత)

121.   మనసు నందు కోర్కె మసలంగ నీయకు,
           ఇంద్రియముల నిగ్రహించు మనుచు,
          చెప్ప సులభమౌను -  చేయగా సాధ్యంబె!
          విమల సుగుణ ధామ వేము భీమ.

122.   భృకుటి మధ్యమందు దృష్టిని నిగుడించి,
          ధ్యాన మందు నుంట ధన్యమనుచు,
          చెప్ప వచ్చు గాని చేయుటే కష్టంబు -
          విమల సుగుణ ధామ వేము భీమ. 

123.   ఇతర సాంప్రదాయ మేవగింతు మటంచు -
          తెల్ల తోలు వారు కళ్ళ బడిన, 
         మోజుపడుచు  చేరి పొగడు చుందురు వారె!
         విమల సుగుణ ధామ వేము భీమ.

124.  పొత్తమైన గాని, విత్త మైనను గాని,
         తరుణి గాని - చేయి దాటి పోవ,
         చేరబోదు తిరిగి చేయెత్తి మ్రొక్కినా!
         విమల సుగుణ ధామ వేము భీమ.

125.  అడగకుండ నివ్వ రాత్మీయులైనను,
         అడిగినా విదల్చ రన్యు లెపుడు,
         తెలివిగాను నీవె తీసుకొ వలయును  -
         విమల సుగుణ ధామ వేము భీమ. 

126.  వయసులోన  నుండ పైకమ్ము లేకను,
         పైకమున్న నాడు వయసు మీఱి,
         తీర్చు కొనగ లేవు తేపి కొర్కెలు నీవు,
         విమల సుగుణ ధామ వేము భీమ.

127.  వయసు నందు తగని వ్యసనాలలో దేలి, 
         ముసిలితనము నందు ముక్తి కాంక్ష
         పురుష లక్షణంబు పుడమిలో నీనాడు  -
         విమల సుగుణ ధామ వేము భీమ.

128.   చిన్నతనము నందు చేరు ‘నారెస్సెసు’,
          ‘స్కూలు’ లోన నుండ ‘సోషలిస్టు’ 
          పెరిగి నంత నౌను పెద్ద ‘కాపిటలిస్టు’
          విమల సుగుణ ధామ వేము భీమ.

129.    బ్రతికి యుండు వరకు ప్రతి రోజు నిందించి,
           చచ్చి నంత వాని మెచ్చు కొనుట,
           కుటిల జగతి జనుల కుత్సిత వ్యాజంబు  -
           విమల సుగుణ ధామ వేము భీమ.

130.    రమ్యగాన పటిమ రంజించు కోకిల 
           గుడ్ల పొదగ లేదు గోము గాను, 
           అల్పమైన కాకి అది చేయ వలయురా - 
           విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పన్నెండవ విడత)

111.  కడుపు నిండ తిండి కలవారి కే రీతి
        వెలితి కడుపు బాధ తెలియ గలదు?
        తిండి పెట్టకుండ ఎండ గట్టిన గాని!
        విమల సుగుణ ధామ వేము భీమ.

112.  ధనికులైన వారి ధర్మ సూత్రంబులు,
         కొలది వారి కెపుడు కుదుర బోవు  -
         కడుపు కాలినపుడు కలుగునే ధర్మంబు?
         విమల సుగుణ ధామ వేము భీమ.

113.  “ఆకలయ్యె నాకు, అన్నంబు లేదింట”
         నన్న పేదతోడ ననియె రాణి,
         “అయిన తినుమిక పరమాన్నంబు, పులిహొర”
         విమల సుగుణ ధామ వేము భీమ.

114.   కల యనంగ నిద్ర కనబడినది కాదు  -
          నీకు నిద్ర పట్ట నీయ నట్టి
          ఆశయమ్ము గాని అవనిలో తలబోయ!
          విమల సుగుణ ధామ వేము భీమ.

115.   ఆత్మ శుద్ధితోడ అర్థించి వేడంగ,
          నీవు నమ్మినట్టి దేవు డెపుడు,
          చెంత చేరి నీకు చింతలు దీర్చును,
          విమల సుగుణ ధామ వేము భీమ.

116.   బలిమి యున్న గాని, కలిమి యున్నను గాని,
          బంధు వర్గమున్న వైద్యులున్న,
          ఆపగలమె మిత్తి అర్థ నిమేష మైన  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

117.   కోర్కు లున్న యెడల కోట్లు రావచ్చును -
          అర్థ కామ వృత్తు లణచు కొన్న
          ధర్మ మోక్ష ఫలము దర్శనంబగు రూఢి!
          విమల సుగుణ ధామ వేము భీమ.

118.   బ్రదుకు గాథలోని రాబోవు పేజీలు
          చదువ వీలు గాక చెదిరి యుండు -
          ఇదియె మంచిదేమొ ఎంచి చూడంగను!
          విమల సుగుణ ధామ వేము భీమ.

119.   ‘చెక్కు’ వ్రాసినంత చిక్కునే పైకంబు,
          ‘బ్యాంకెకౌంటు’ నందు ‘క్యాషు’ లేక -
          పొందగలమె సుఖము పూర్వ పుణ్యము లేక?
          విమల సుగుణ ధామ వేము భీమ.

 120.  నేను కలను గంటి నృపతి నైనట్లుగా
          లేచి చూడ చుట్టు లేమి నవ్వె  -
          సత్యమెద్ది  తలప స్వప్నమా, మెలకువా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదకొండవ విడత)

101.   బ్రదుకు క్రీడ యనెడు చదరంగ మందున
          నీవె రాజు -  కాని నీ మనుగడ
          నిర్ణయించు వారు నీ చుట్టు బలగాలె!
          విమల సుగుణ ధామ వేము భీమ.

102.   ఎఱిగి నట్టి వారి నించుక వెను దట్టు,
          అందు మంచి వారి నాదరించు,
          ఎన్నడైన గాని హింసించ కెవరినీ  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

103.   తరతరాల కొఱకు ధనము గణించుటే
          రాజకీయ వేత్త లక్ష్య మెపుడు,
          సంతతికి స్వశక్తి సుంతైన లేకనే! 
          విమల సుగుణ ధామ వేము భీమ.

104.  చదువు లేని వాడు చదువుల మంత్రైన,
          గొప్ప కొఱకు మార్చు ‘కోర్సు’ లెల్ల,
          తెలియు దీని ఫలము కొన్ని ఏండ్లైనాక  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

105.   కట్నమను పిశాచి కాల వ్రాయ వలయు
          ననుచు సభలలోన నఱచు వారె
          లాంఛనాల పేర  లక్షల గొందురు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

106.   అంటరానితనము వెంటనే మాన్పించ
          వలె నటంచు చెప్పు ప్రజలలోన,
          వారి వియ్యమందు వారెందరున్నారు?
          విమల సుగుణ ధామ వేము భీమ.

107.   పౌర హక్కులకై ప్రతి పౌరు డీనాడు
          గొంతు చించు  కొనుచు గెంతు గాని
          పౌర బాధ్యతలను పట్టించు కోడేల!
          విమల సుగుణ ధామ వేము భీమ.

108.   పాలు చేపనట్టి బర్రె, పండని చేను,
          లంచగొండి భటులు, రాని విద్య,
          రక్షణివ్వలేని రాజ్యంబు వీడుము  -
          విమల సుగుణ ధామ వేము భీమ.
              
109.   బ్రదుకునందు జరుగు ప్రతి సంఘటన గూడ,
          మంచి దనుచు స్వాగతించ వలయు,
          పుడమిలోన నిదియె ‘పోజిటివ్ థింకింగు’  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

110.   ఇల్లు కలదు నాకి కే బెంగ లేదను
          వాడె ‘ఆప్టిమిస్టు’, వసతి తప్ప
          ఏమి లేదను నత డిలలోన ‘పెసిమిస్టు’ -            
          విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదవ విడత)

91.   కొలది వాని నీవు కొలువులో నుంచిన,
        వేతనమ్మె కాదు ‘వేష్టు’ ఖర్చు
        చేత గాక వాడు చెఱచును పనులన్ని,
        విమల సుగుణ ధామ వేము భీమ.

92.   ఉన్నతాధికారి ఉత్సాహి గానిచో,
         క్రింది వారు స్ఫూర్తి  జెంద రెపుడు -
         సేన నడువ బోదు సేనాని నిద్రింప!
         విమల సుగుణ ధామ వేము భీమ.

93.    అలతి మనుజు లెన్న అధికారులై యున్న,
         దేశవృద్ధి పైన దృష్టి సున్న -
         ఆశయంబు కన్న”యామ్యాము” లే మిన్న!
         విమల సుగుణ ధామ వేము భీమ.

94.    ఊబ జనుడు పెద్ద యుద్యోగి యైనచో,
         దేశ మమ్మి వేయు కాసు కొఱకు,
         ప్రతిభ లేని వాడు కతక కుండగ లేడు  -
         విమల సుగుణ ధామ వేము భీమ.

95.   శత్రు దాడి నుండి చతురత దేశంబు
        కాచు కొనగ వచ్చు కలత లేదు,
        కలుష రాజకీయ ఖామందులే ముప్పు -
        విమల సుగుణ ధామ వేము భీమ.

96.   ప్రజల ప్రతినిధి యన - నిజముగా నీ నాడు
        ప్రజల ప్రతి నిధియును రంజు గాను
        తనదటంచు తలచి దాని తినెడు వాడె -
        విమల సుగుణ ధామ వేము భీమ.

97.   రాజకీయ వేత్త రమ్యంబుగా నేడు
        నటనమాడు జనుల నమ్మ జేయ -
        వారు మూర్ఖు లనుచు వాని నమ్మక మేమొ!
        విమల సుగుణ ధామ వేము భీమ.

98.   పెద్ద ‘ఫిల్ము స్టారు’ ‘ఫ్రీ రోడ్డు షో’ లివ్వ ,
        వాని జూడ జనులు వచ్చి నాను,
        ఓటు నిత్తురన్న మాటుత్తిదే సుమ్ము!
        విమల సుగుణ ధామ వేము భీమ.

99.   ఓటు వేయమన్న మాట చాలదు నేడు,
        మాట తోడ పెద్ద మూట నిచ్చి,
        కల్ల బొల్లి ఆశ కల్పింపగావలె -
        విమల సుగుణ ధామ వేము భీమ.

100.  నోరు తెరచి సీత కోరలే దెన్నండు,
         అడవి లోని భర్మ హరిణి దక్క,
         దాని వలన నయ్యె దానవ నాశంబు -
         విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(తొమ్మిదవ విడత)

81.    ఆడు బిడ్డ పెరిగి అత్త ఇంటికి బోవు,
         మగువ వచ్చి కొడుకు మాట వినడు,
         కడకు మనకు కారు కొడుకులూ కూతుళ్ళు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

82.     ఆడపిల్ల యనిన అమ్మకు నాన్నకు
          భర్తకైన నేడు భార మయ్యె -
          ఆడువారు లేని అవని ఎట్లుండురా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

83.     అబలలన్న పూర్వ మలుసని విందుము,
          చదువుకొన్న వనిత చతుర యగుట
          అత్త మామ భర్త లణగి యుందురు నేడు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

84.     నీవు పోవు దారి పోవడు కొడుకని,
          అలుక జెందబోకు మతని పైన -
          నీవు తీర్చినావె నీ తండ్రి కొరికల్!
         విమల సుగుణ ధామ వేము భీమ.

85.    వృద్ధి పొంద మనకు వివిధ మార్గము లుండు,
         నీకు నచ్చు దారి నీది సుమ్ము,
         పరుల త్రొవ లెపుడు పెఱ త్రొవలే కదా!
         విమల సుగుణ ధామ వేము భీమ.

86.   కాస్తొ, కూస్తొ చదివి ‘కాన్వెంటు’ నందున,
        అమ్మ నిపుడు పిల్ల లమ్మ అనరు -
        ‘మమ్మి’ యనుచు దాని ‘మమ్మీ’గ మార్చిరి! 
        విమల సుగుణ ధామ వేము భీమ.

87.   పెద్ద వారి జూచి పిల్లలు పూర్వము,
        ఇంపుగా నమస్కరించు వారు  -
        ఆవు తొలినట్లు ‘హాయ్’ అందు రీనాడు!
        విమల సుగుణ ధామ వేము భీమ.

88.   కొత్త కోడ లొకతె అత్తపై చేయెత్త,
        ముప్ప దేండ్ల పిదప ముద్దు తీర,
        తనకు కోడలొచ్చి తన నట్లు చేయదా!
        విమల సుగుణ ధామ వేము భీమ.

89.   తరుణి కోర నొకడు తల్లి గుండెను కోసి,
        త్వరగ పోవ గడప తగిలి పడగ
        తలకి దెబ్బ తగుల తల్లి గుండేడ్చెరా!
        విమల సుగుణ ధామ వేము భీమ.

90.   మాట తూలినంత ‘మర్డరు’ చేయక,
        మంచి మాట తోడ మార్చు మతని -
        హింస కన్న శ్రేయ మింపు కూర్చుట గాదె!
        విమల సుగుణ ధామ వేము భీమ.