10, నవంబర్ 2012, శనివారం

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదమూడవ విడత)

121.   మనసు నందు కోర్కె మసలంగ నీయకు,
           ఇంద్రియముల నిగ్రహించు మనుచు,
          చెప్ప సులభమౌను -  చేయగా సాధ్యంబె!
          విమల సుగుణ ధామ వేము భీమ.

122.   భృకుటి మధ్యమందు దృష్టిని నిగుడించి,
          ధ్యాన మందు నుంట ధన్యమనుచు,
          చెప్ప వచ్చు గాని చేయుటే కష్టంబు -
          విమల సుగుణ ధామ వేము భీమ. 

123.   ఇతర సాంప్రదాయ మేవగింతు మటంచు -
          తెల్ల తోలు వారు కళ్ళ బడిన, 
         మోజుపడుచు  చేరి పొగడు చుందురు వారె!
         విమల సుగుణ ధామ వేము భీమ.

124.  పొత్తమైన గాని, విత్త మైనను గాని,
         తరుణి గాని - చేయి దాటి పోవ,
         చేరబోదు తిరిగి చేయెత్తి మ్రొక్కినా!
         విమల సుగుణ ధామ వేము భీమ.

125.  అడగకుండ నివ్వ రాత్మీయులైనను,
         అడిగినా విదల్చ రన్యు లెపుడు,
         తెలివిగాను నీవె తీసుకొ వలయును  -
         విమల సుగుణ ధామ వేము భీమ. 

126.  వయసులోన  నుండ పైకమ్ము లేకను,
         పైకమున్న నాడు వయసు మీఱి,
         తీర్చు కొనగ లేవు తేపి కొర్కెలు నీవు,
         విమల సుగుణ ధామ వేము భీమ.

127.  వయసు నందు తగని వ్యసనాలలో దేలి, 
         ముసిలితనము నందు ముక్తి కాంక్ష
         పురుష లక్షణంబు పుడమిలో నీనాడు  -
         విమల సుగుణ ధామ వేము భీమ.

128.   చిన్నతనము నందు చేరు ‘నారెస్సెసు’,
          ‘స్కూలు’ లోన నుండ ‘సోషలిస్టు’ 
          పెరిగి నంత నౌను పెద్ద ‘కాపిటలిస్టు’
          విమల సుగుణ ధామ వేము భీమ.

129.    బ్రతికి యుండు వరకు ప్రతి రోజు నిందించి,
           చచ్చి నంత వాని మెచ్చు కొనుట,
           కుటిల జగతి జనుల కుత్సిత వ్యాజంబు  -
           విమల సుగుణ ధామ వేము భీమ.

130.    రమ్యగాన పటిమ రంజించు కోకిల 
           గుడ్ల పొదగ లేదు గోము గాను, 
           అల్పమైన కాకి అది చేయ వలయురా - 
           విమల సుగుణ ధామ వేము భీమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి