10, నవంబర్ 2012, శనివారం

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(తొమ్మిదవ విడత)

81.    ఆడు బిడ్డ పెరిగి అత్త ఇంటికి బోవు,
         మగువ వచ్చి కొడుకు మాట వినడు,
         కడకు మనకు కారు కొడుకులూ కూతుళ్ళు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

82.     ఆడపిల్ల యనిన అమ్మకు నాన్నకు
          భర్తకైన నేడు భార మయ్యె -
          ఆడువారు లేని అవని ఎట్లుండురా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

83.     అబలలన్న పూర్వ మలుసని విందుము,
          చదువుకొన్న వనిత చతుర యగుట
          అత్త మామ భర్త లణగి యుందురు నేడు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

84.     నీవు పోవు దారి పోవడు కొడుకని,
          అలుక జెందబోకు మతని పైన -
          నీవు తీర్చినావె నీ తండ్రి కొరికల్!
         విమల సుగుణ ధామ వేము భీమ.

85.    వృద్ధి పొంద మనకు వివిధ మార్గము లుండు,
         నీకు నచ్చు దారి నీది సుమ్ము,
         పరుల త్రొవ లెపుడు పెఱ త్రొవలే కదా!
         విమల సుగుణ ధామ వేము భీమ.

86.   కాస్తొ, కూస్తొ చదివి ‘కాన్వెంటు’ నందున,
        అమ్మ నిపుడు పిల్ల లమ్మ అనరు -
        ‘మమ్మి’ యనుచు దాని ‘మమ్మీ’గ మార్చిరి! 
        విమల సుగుణ ధామ వేము భీమ.

87.   పెద్ద వారి జూచి పిల్లలు పూర్వము,
        ఇంపుగా నమస్కరించు వారు  -
        ఆవు తొలినట్లు ‘హాయ్’ అందు రీనాడు!
        విమల సుగుణ ధామ వేము భీమ.

88.   కొత్త కోడ లొకతె అత్తపై చేయెత్త,
        ముప్ప దేండ్ల పిదప ముద్దు తీర,
        తనకు కోడలొచ్చి తన నట్లు చేయదా!
        విమల సుగుణ ధామ వేము భీమ.

89.   తరుణి కోర నొకడు తల్లి గుండెను కోసి,
        త్వరగ పోవ గడప తగిలి పడగ
        తలకి దెబ్బ తగుల తల్లి గుండేడ్చెరా!
        విమల సుగుణ ధామ వేము భీమ.

90.   మాట తూలినంత ‘మర్డరు’ చేయక,
        మంచి మాట తోడ మార్చు మతని -
        హింస కన్న శ్రేయ మింపు కూర్చుట గాదె!
        విమల సుగుణ ధామ వేము భీమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి