10, నవంబర్ 2012, శనివారం

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదునైదవ విడత)

141.   ఈత నేర్పు తరిని ఈతపై పాఠంబు
          చెప్ప వలను లేదు గొప్పగాను,
          నేర్పు తోడ వాని నీట త్రోసిన చాలు!
          విమల సుగుణ ధామ వేము భీమ.

142.   వయసు తోడ తెలివి పెరుగునా మనిషికి?
          పెరుగ వేమిగూడ తఱుగు గాని
          ముఖము పైన నుండు ముడుత లొక్కటి తక్క -
          విమల సుగుణ ధామ వేము భీమ.               

143.   పుట్టినపుడు మనిషి మూర్ఖుడై పుట్టడు,
          పెరుగు నపుడు వాడు పరుల జూచి
          ఎన్ని ఏండ్లొ నేర్చి ఇట్లౌను శ్రమియించి -
          విమల సుగుణ ధామ వేము భీమ.
 
144.   న్యూసు పేపరెంత నూరి మ్రింగిన గాని,
          కలుగ బోదు తెలివి ఖలున కెపుడు  -
          కాగితాలు నమలి కవి యౌనె ఖర మెన్న? 
          విమల సుగుణ ధామ వేము భీమ.

145.   భార్య తోడ నీవు బ్రతుకు టెట్లన్నచో,
          తప్పు చేసి నప్పు డొప్పు కొనుము,
          భార్య తప్పు చేయ పన్నెత్త బోకుము!                                                          
          విమల సుగుణ ధామ వేము భీమ.

146.   ప్రేమ యనగ నేడు పెద్ద గాలంబయ్యె ,
          చిక్కె నేని పెద్ద చాప చిక్కు,
          చిక్క కున్న గూడ చిత్రమౌ ‘టైంపాసు’ -
          విమల సుగుణ ధామ వేము భీమ.

147.    దుడుకు తోడ వాడు దుప్పటీ విసిరెను
           శీతకాల మనెడి చింత లేక, 
           పడచు భార్య తనకు ప్రక్క నున్నది గాన -
           విమల సుగుణ ధామ వేము భీమ.

148.    కనుల బడడు మనకు కాయజుం డెచ్చోట,
           అయిన వాడు చేయు ఆగడమ్ము
           లెంచిచూడ నెడద నిన్నిన్ని గాదయా!
           విమల సుగుణ ధామ వేము భీమ.

149.    “అమ్మ ఒడిని మరల నాదమఱచి హాయి
           నిద్రపోవ తలతు నేను!  కాని
           అడ్డ మయ్యె నాకు గెడ్డ మొక్కటి నేడు” -
           విమల సుగుణ ధామ వేము భీమ.

150.    పైకి క్రింది కెపుడు పరిగెత్తు నెయ్యది,
           ఆగి పోవ కదల కాగు నెద్ది?
          ‘సెక్రెటేరియట్టు సీక్రెట్టు ఫైలు’రా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

151.   భరత దేశమందు ప్రభవించుటే గొప్ప!
          తెలుగు మాతృభాష గలుగ గొప్ప!
         భారతీయత మన బ్రదుకు  నింపుటె గొప్ప!
         విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదునాల్గవ విడత)

131.    జీవితాన సగటుజీవి చేసెడు తప్పు,
           తప్పు చేతు ననెడు తలపు తోడ
           బాధ పడుచు సతము బ్రతుకుటే తలబోయ  -
           విమల సుగుణ ధామ వేము భీమ.

132.    భావి కొఱకు నీవు బాధతో కుందుచు,
           వర్తమాన మందు బ్రదుక మఱచి,
           రెంటికి చెడినట్టి రేవడై పోకుము  -
           విమల సుగుణ ధామ వేము భీమ.

133.    జరిగినవి జరిగెను - చర్చ చేయగ నేల,
           జరుగ బోవు నవియు జరుగ వేమొ? 
           జరుగ నట్టి వాటి  కొఱకెందుకో చింత! 
           విమల సుగుణ ధామ వేము భీమ.

134.    ప్రక్క ఇంటి వాని భార్య రూపసి యంచు
           పొగడనట్టి భర్త భువిని అరుదు -
           పుల్లనైనను రుచి పొరుగింటి గోంగూర!
           విమల సుగుణ ధామ వేము భీమ.

135.    దూరమందు గిరులు సౌరుగా తోచును, 
           చెంత కేగ గట్లు గుంత లుండు  -
           పొరుగువాని భాగ్య భోగ్యంబు లిట్లురా!
           విమల సుగుణ ధామ వేము భీమ.

136.    పనిని పూర్తి చేయ పట్టి ప్రయత్నించు,
           గెలువ నంత మాత్ర తొలగ బోకు,
           అదియె మొదటి యత్న మనుకొని సాగరా -                
           విమల సుగుణ ధామ వేము భీమ.

137.   యుద్ధమందు తగులు పెద్ద దెబ్బలు గూడ,
          మాసిపోవు కాల మహిమ వలన,
          మాసిపోని  వెపుడు మనవారి దెప్పులే!
          విమల సుగుణ ధామ వేము భీమ.

138.   నీరు జలధి నున్న నింగిపై కెగురును
          హస్త మందు గొన్న నడగి యుండు  -
          స్థాన బల్మి గాని తన బల్మి కాదయా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

139.   మంచి జరుగు నాడు మారాజు ననుకోకు, 
          కీడు జరుగు నపుడు క్లేశ పడకు,
          కష్ట  సుఖము లెపుడు కావడి కుండలే -
          విమల సుగుణ ధామ వేము భీమ.

140.   కొన్ని పుస్తకాలు కొని చదువ వలయు,
          కొన్ని అరువు తెచ్చి, కొన్ని ‘బుక్సు’
          చిత్తగించ బోకు డుత్తినే ఇచ్చినా  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదమూడవ విడత)

121.   మనసు నందు కోర్కె మసలంగ నీయకు,
           ఇంద్రియముల నిగ్రహించు మనుచు,
          చెప్ప సులభమౌను -  చేయగా సాధ్యంబె!
          విమల సుగుణ ధామ వేము భీమ.

122.   భృకుటి మధ్యమందు దృష్టిని నిగుడించి,
          ధ్యాన మందు నుంట ధన్యమనుచు,
          చెప్ప వచ్చు గాని చేయుటే కష్టంబు -
          విమల సుగుణ ధామ వేము భీమ. 

123.   ఇతర సాంప్రదాయ మేవగింతు మటంచు -
          తెల్ల తోలు వారు కళ్ళ బడిన, 
         మోజుపడుచు  చేరి పొగడు చుందురు వారె!
         విమల సుగుణ ధామ వేము భీమ.

124.  పొత్తమైన గాని, విత్త మైనను గాని,
         తరుణి గాని - చేయి దాటి పోవ,
         చేరబోదు తిరిగి చేయెత్తి మ్రొక్కినా!
         విమల సుగుణ ధామ వేము భీమ.

125.  అడగకుండ నివ్వ రాత్మీయులైనను,
         అడిగినా విదల్చ రన్యు లెపుడు,
         తెలివిగాను నీవె తీసుకొ వలయును  -
         విమల సుగుణ ధామ వేము భీమ. 

126.  వయసులోన  నుండ పైకమ్ము లేకను,
         పైకమున్న నాడు వయసు మీఱి,
         తీర్చు కొనగ లేవు తేపి కొర్కెలు నీవు,
         విమల సుగుణ ధామ వేము భీమ.

127.  వయసు నందు తగని వ్యసనాలలో దేలి, 
         ముసిలితనము నందు ముక్తి కాంక్ష
         పురుష లక్షణంబు పుడమిలో నీనాడు  -
         విమల సుగుణ ధామ వేము భీమ.

128.   చిన్నతనము నందు చేరు ‘నారెస్సెసు’,
          ‘స్కూలు’ లోన నుండ ‘సోషలిస్టు’ 
          పెరిగి నంత నౌను పెద్ద ‘కాపిటలిస్టు’
          విమల సుగుణ ధామ వేము భీమ.

129.    బ్రతికి యుండు వరకు ప్రతి రోజు నిందించి,
           చచ్చి నంత వాని మెచ్చు కొనుట,
           కుటిల జగతి జనుల కుత్సిత వ్యాజంబు  -
           విమల సుగుణ ధామ వేము భీమ.

130.    రమ్యగాన పటిమ రంజించు కోకిల 
           గుడ్ల పొదగ లేదు గోము గాను, 
           అల్పమైన కాకి అది చేయ వలయురా - 
           విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పన్నెండవ విడత)

111.  కడుపు నిండ తిండి కలవారి కే రీతి
        వెలితి కడుపు బాధ తెలియ గలదు?
        తిండి పెట్టకుండ ఎండ గట్టిన గాని!
        విమల సుగుణ ధామ వేము భీమ.

112.  ధనికులైన వారి ధర్మ సూత్రంబులు,
         కొలది వారి కెపుడు కుదుర బోవు  -
         కడుపు కాలినపుడు కలుగునే ధర్మంబు?
         విమల సుగుణ ధామ వేము భీమ.

113.  “ఆకలయ్యె నాకు, అన్నంబు లేదింట”
         నన్న పేదతోడ ననియె రాణి,
         “అయిన తినుమిక పరమాన్నంబు, పులిహొర”
         విమల సుగుణ ధామ వేము భీమ.

114.   కల యనంగ నిద్ర కనబడినది కాదు  -
          నీకు నిద్ర పట్ట నీయ నట్టి
          ఆశయమ్ము గాని అవనిలో తలబోయ!
          విమల సుగుణ ధామ వేము భీమ.

115.   ఆత్మ శుద్ధితోడ అర్థించి వేడంగ,
          నీవు నమ్మినట్టి దేవు డెపుడు,
          చెంత చేరి నీకు చింతలు దీర్చును,
          విమల సుగుణ ధామ వేము భీమ.

116.   బలిమి యున్న గాని, కలిమి యున్నను గాని,
          బంధు వర్గమున్న వైద్యులున్న,
          ఆపగలమె మిత్తి అర్థ నిమేష మైన  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

117.   కోర్కు లున్న యెడల కోట్లు రావచ్చును -
          అర్థ కామ వృత్తు లణచు కొన్న
          ధర్మ మోక్ష ఫలము దర్శనంబగు రూఢి!
          విమల సుగుణ ధామ వేము భీమ.

118.   బ్రదుకు గాథలోని రాబోవు పేజీలు
          చదువ వీలు గాక చెదిరి యుండు -
          ఇదియె మంచిదేమొ ఎంచి చూడంగను!
          విమల సుగుణ ధామ వేము భీమ.

119.   ‘చెక్కు’ వ్రాసినంత చిక్కునే పైకంబు,
          ‘బ్యాంకెకౌంటు’ నందు ‘క్యాషు’ లేక -
          పొందగలమె సుఖము పూర్వ పుణ్యము లేక?
          విమల సుగుణ ధామ వేము భీమ.

 120.  నేను కలను గంటి నృపతి నైనట్లుగా
          లేచి చూడ చుట్టు లేమి నవ్వె  -
          సత్యమెద్ది  తలప స్వప్నమా, మెలకువా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదకొండవ విడత)

101.   బ్రదుకు క్రీడ యనెడు చదరంగ మందున
          నీవె రాజు -  కాని నీ మనుగడ
          నిర్ణయించు వారు నీ చుట్టు బలగాలె!
          విమల సుగుణ ధామ వేము భీమ.

102.   ఎఱిగి నట్టి వారి నించుక వెను దట్టు,
          అందు మంచి వారి నాదరించు,
          ఎన్నడైన గాని హింసించ కెవరినీ  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

103.   తరతరాల కొఱకు ధనము గణించుటే
          రాజకీయ వేత్త లక్ష్య మెపుడు,
          సంతతికి స్వశక్తి సుంతైన లేకనే! 
          విమల సుగుణ ధామ వేము భీమ.

104.  చదువు లేని వాడు చదువుల మంత్రైన,
          గొప్ప కొఱకు మార్చు ‘కోర్సు’ లెల్ల,
          తెలియు దీని ఫలము కొన్ని ఏండ్లైనాక  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

105.   కట్నమను పిశాచి కాల వ్రాయ వలయు
          ననుచు సభలలోన నఱచు వారె
          లాంఛనాల పేర  లక్షల గొందురు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

106.   అంటరానితనము వెంటనే మాన్పించ
          వలె నటంచు చెప్పు ప్రజలలోన,
          వారి వియ్యమందు వారెందరున్నారు?
          విమల సుగుణ ధామ వేము భీమ.

107.   పౌర హక్కులకై ప్రతి పౌరు డీనాడు
          గొంతు చించు  కొనుచు గెంతు గాని
          పౌర బాధ్యతలను పట్టించు కోడేల!
          విమల సుగుణ ధామ వేము భీమ.

108.   పాలు చేపనట్టి బర్రె, పండని చేను,
          లంచగొండి భటులు, రాని విద్య,
          రక్షణివ్వలేని రాజ్యంబు వీడుము  -
          విమల సుగుణ ధామ వేము భీమ.
              
109.   బ్రదుకునందు జరుగు ప్రతి సంఘటన గూడ,
          మంచి దనుచు స్వాగతించ వలయు,
          పుడమిలోన నిదియె ‘పోజిటివ్ థింకింగు’  -
          విమల సుగుణ ధామ వేము భీమ.

110.   ఇల్లు కలదు నాకి కే బెంగ లేదను
          వాడె ‘ఆప్టిమిస్టు’, వసతి తప్ప
          ఏమి లేదను నత డిలలోన ‘పెసిమిస్టు’ -            
          విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(పదవ విడత)

91.   కొలది వాని నీవు కొలువులో నుంచిన,
        వేతనమ్మె కాదు ‘వేష్టు’ ఖర్చు
        చేత గాక వాడు చెఱచును పనులన్ని,
        విమల సుగుణ ధామ వేము భీమ.

92.   ఉన్నతాధికారి ఉత్సాహి గానిచో,
         క్రింది వారు స్ఫూర్తి  జెంద రెపుడు -
         సేన నడువ బోదు సేనాని నిద్రింప!
         విమల సుగుణ ధామ వేము భీమ.

93.    అలతి మనుజు లెన్న అధికారులై యున్న,
         దేశవృద్ధి పైన దృష్టి సున్న -
         ఆశయంబు కన్న”యామ్యాము” లే మిన్న!
         విమల సుగుణ ధామ వేము భీమ.

94.    ఊబ జనుడు పెద్ద యుద్యోగి యైనచో,
         దేశ మమ్మి వేయు కాసు కొఱకు,
         ప్రతిభ లేని వాడు కతక కుండగ లేడు  -
         విమల సుగుణ ధామ వేము భీమ.

95.   శత్రు దాడి నుండి చతురత దేశంబు
        కాచు కొనగ వచ్చు కలత లేదు,
        కలుష రాజకీయ ఖామందులే ముప్పు -
        విమల సుగుణ ధామ వేము భీమ.

96.   ప్రజల ప్రతినిధి యన - నిజముగా నీ నాడు
        ప్రజల ప్రతి నిధియును రంజు గాను
        తనదటంచు తలచి దాని తినెడు వాడె -
        విమల సుగుణ ధామ వేము భీమ.

97.   రాజకీయ వేత్త రమ్యంబుగా నేడు
        నటనమాడు జనుల నమ్మ జేయ -
        వారు మూర్ఖు లనుచు వాని నమ్మక మేమొ!
        విమల సుగుణ ధామ వేము భీమ.

98.   పెద్ద ‘ఫిల్ము స్టారు’ ‘ఫ్రీ రోడ్డు షో’ లివ్వ ,
        వాని జూడ జనులు వచ్చి నాను,
        ఓటు నిత్తురన్న మాటుత్తిదే సుమ్ము!
        విమల సుగుణ ధామ వేము భీమ.

99.   ఓటు వేయమన్న మాట చాలదు నేడు,
        మాట తోడ పెద్ద మూట నిచ్చి,
        కల్ల బొల్లి ఆశ కల్పింపగావలె -
        విమల సుగుణ ధామ వేము భీమ.

100.  నోరు తెరచి సీత కోరలే దెన్నండు,
         అడవి లోని భర్మ హరిణి దక్క,
         దాని వలన నయ్యె దానవ నాశంబు -
         విమల సుగుణ ధామ వేము భీమ.

భీమ శతకం

భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.


(తొమ్మిదవ విడత)

81.    ఆడు బిడ్డ పెరిగి అత్త ఇంటికి బోవు,
         మగువ వచ్చి కొడుకు మాట వినడు,
         కడకు మనకు కారు కొడుకులూ కూతుళ్ళు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

82.     ఆడపిల్ల యనిన అమ్మకు నాన్నకు
          భర్తకైన నేడు భార మయ్యె -
          ఆడువారు లేని అవని ఎట్లుండురా!
          విమల సుగుణ ధామ వేము భీమ.

83.     అబలలన్న పూర్వ మలుసని విందుము,
          చదువుకొన్న వనిత చతుర యగుట
          అత్త మామ భర్త లణగి యుందురు నేడు -
          విమల సుగుణ ధామ వేము భీమ.

84.     నీవు పోవు దారి పోవడు కొడుకని,
          అలుక జెందబోకు మతని పైన -
          నీవు తీర్చినావె నీ తండ్రి కొరికల్!
         విమల సుగుణ ధామ వేము భీమ.

85.    వృద్ధి పొంద మనకు వివిధ మార్గము లుండు,
         నీకు నచ్చు దారి నీది సుమ్ము,
         పరుల త్రొవ లెపుడు పెఱ త్రొవలే కదా!
         విమల సుగుణ ధామ వేము భీమ.

86.   కాస్తొ, కూస్తొ చదివి ‘కాన్వెంటు’ నందున,
        అమ్మ నిపుడు పిల్ల లమ్మ అనరు -
        ‘మమ్మి’ యనుచు దాని ‘మమ్మీ’గ మార్చిరి! 
        విమల సుగుణ ధామ వేము భీమ.

87.   పెద్ద వారి జూచి పిల్లలు పూర్వము,
        ఇంపుగా నమస్కరించు వారు  -
        ఆవు తొలినట్లు ‘హాయ్’ అందు రీనాడు!
        విమల సుగుణ ధామ వేము భీమ.

88.   కొత్త కోడ లొకతె అత్తపై చేయెత్త,
        ముప్ప దేండ్ల పిదప ముద్దు తీర,
        తనకు కోడలొచ్చి తన నట్లు చేయదా!
        విమల సుగుణ ధామ వేము భీమ.

89.   తరుణి కోర నొకడు తల్లి గుండెను కోసి,
        త్వరగ పోవ గడప తగిలి పడగ
        తలకి దెబ్బ తగుల తల్లి గుండేడ్చెరా!
        విమల సుగుణ ధామ వేము భీమ.

90.   మాట తూలినంత ‘మర్డరు’ చేయక,
        మంచి మాట తోడ మార్చు మతని -
        హింస కన్న శ్రేయ మింపు కూర్చుట గాదె!
        విమల సుగుణ ధామ వేము భీమ.

హాలుని గాథ - లోలుని బాథ

రచన: వి.యల్.యస్. భీమశంకరం

ఉ.         ఆమని యేగుదెంచె తొలి యౌవన మన్మథ రాగ హేలుడై
             ప్రేమకుమారు డొక్కరుడు ప్రీతిగ హాలుని గాథలన్ మదిన్
             గోముగ  జ్ఞప్తి చేసుకుని, గోప్యముగా నెఱజాణ కోసమై
             గ్రామము చేరి బాట కిరుప్రక్కల చూచుచు నేగుచుండగన్.

కం.       తనవంటి అందగాడిల
           కనిపించడనుచు తలంచి కలకంఠులు చూ
           చిన తన ఒడిలో వ్రాలుదు
           రనుచు కలలు కనుచు నదటున పోవన్.

తే. గీ.  పల్లె పడచు లమాయక ప్రతిమ లగుట,
          పట్నవాసపు యువకులు వారి చేరి
         వలల లోనను పడవేయ సులభమనుచు,
         అమితమౌ ఆశ నున్నట్టి సమయమందు.

తే. గీ.  బాట ప్రక్కను పెద్ద భవంతి లోన
          వీధి వాకిలి కొక్కింత వాలి నిలిచి
          కంతు కాంతను హసియించు గరిత యొకతె
          వగలు పోవుచు నతనితో పలికె నిటులు.

ఉ.      “చక్కనివాడ! ఎక్కడకు చయ్యన పోవుచునుంటి వీవు! నే
          నొక్కతె నున్నదాన - మగడూరికి పోయెను - రేపుగాని వా
          డిక్కడ రా”డనంగ విని ఎంతయొ సంతసమంది బాలుడున్,
          మక్కువ చెంత చేరె - కుసుమధ్వజు డార్చుచు నేయ బాణముల్.

కం.     వచ్చిన  వానిని సుందరి
          అచ్చికములు పల్కుచు తగు ననునయములతో
          హెచ్చగ వానికి తృష్ణలు
          తచ్చన గొనిపోయి వీథి తలుపులు మూసెన్.

తే. గీ.  మంచి మాటల తోడను మత్తు గొల్పి,
          పెరడు లోనికి గొనిపోయి ప్రేతిమీర 
          చెంత నొక బిందె నీరున్న చెంబు చూపి,
          ఇంపు రాణింప వానితో నిట్టులనియె.

తే. గీ.  పాలు పిదుకంగ రాలేదు పాలెగాపు,
          ఆకలికి తట్టుకోలేక అటమటించి,
            ఆవుదూడ అంబా యని ఆర్చుచుండె  
            బిందెగొని పోయి పాలను పితుకుమయ్య.

తే. గీ.   నేను గూడను ఉదయాన నిద్ర లేచి,
           కాఫి త్రాగక పోయిన కదలలేను -
           మధురమౌ యూహలొచ్చి మాయమగును
           అంగజుం డావహింప బోడంత దనుక.

ఉ.       అనవిని ఆత డించుక నిరాశను చెందియు కాఫి త్రాగినన్
          తన ప్రియురా లనంగ నిశితాస్త్ర పరంపర తాకి వేగమే
          తనపయి ప్రేమ చూపునని తల్చుచు పాలను పిండు పద్ధతుల్
          తన కెటు చేతకావను యదార్థము విస్మరించుచున్.

తే. గీ.  మెల్లమెల్లగ కదలుచు నుల్లమదర, 
          ఆత డేగుచు బిందెతో నావు కడకు,
          పొదుగు చెంతను కూర్చుండి మోహరించి,
          రెండు పితుకుల నెటులనో పిండ బూనె.

తే. గీ.  ఇంతలోన దూడను విప్పె నిందువదన,
          తమిని పర్వెత్తె నా పెయ్య తల్లి దరికి,
        చెంత చేరంగ నెంతయో సంతసించి,
        దూడ దిక్కు తిరిగె నావు దురుసు గాను.

తే. గీ.  పదిలముగ వంగి గోమాత పొదుగు చెంత
          కూర్చునున్నట్టి పట్నంపు కుర్రవాడు
          తలరి లేవబోవగ ఆవు తలను విసిరె,
          కొమ్ము మోమున నాటి రక్తమ్ము జిమ్మ.
         
తే. గీ.  భీతి నార్చెను బాలుడు -బెదిరి గోవు
         కొమ్ముతోడను పొడిచెను దిమ్మ తిరిగి
         క్రింద పడిపోవ నాతడు బెందలోన,
        మరల కాళ్ళతో నూకుచు మట్టె నపుడు.

తే. గీ.   పరుగు పరుగున నా తన్వి దరికి వచ్చి,
          మోమునందున లేచిన బొప్పి వాని,
          కాళ్ళు  చేతుల నల్లల్ల గాయమైన
         చిన్న వానిని చేయిచ్చి చేరదీసి,

తే. గీ.  ఇంటిలోనికి గొనిపోయి వెంటవెంట,
          అంగవస్త్రము తోడ గాయములు తుడిచి,
          పౌడరును పూసి కొంత ఫస్టైడు చేసి,
          వీధి గుమ్మము దాకను వెంట నంపి.

తే. గీ.  “నేస్తమా విను మిచట చౌరస్త కడను
           వైద్యుడొక్కరుడు కలడు వాని కలిసి,
           ఆతడిచ్చు మందులను గాయముల పూసి
           బిళ్ళలను మ్రింగి నీవింటి కెళ్ళు మింక.

తే. గీ.  అతిథి వీవౌట కాఫి మర్యాద కివ్వ
          న్యాయమగు గాని ఇది సమయంబు గాదు
          తత్ క్షణమె పోయి నే కాఫి త్రాగ వలయు
          తాళలేనింక పాంథుడా! వేళ మించె.  

తే. గీ.  ఇంటిలోన నిన్నటి పాలు కొన్ని మిగుల
          పెట్టితిని గ్లాసులో పోసి ఫ్రిజ్జులోన
          నాకు పాత పాలతొ కాఫి నచ్చ దైన,
          తప్పదింక నేడిట్టిదే త్రాగవలయు.

తే. గీ.  నిన్న పితికిన పాలతో నేడు కాఫి
          త్రాగలేకనె వీథిలో తలుపు వద్ద
          నిలిచి నిన్ను రమ్మంచు నే పిలిచినాను. 

తే. గీ.  తెలివిలేని వాని వలె నీ తీరు తోచె,
          పట్నమందున నివసించు వాడ వనుచు
          చెక్కు చెదరని నీ క్రాపు చెప్పె నాకు,
          ముక్కుపచ్చలారని మోము ముందె తెలిపె
          పల్లెపడుచుల వలలలో పడుదువనుచు. 

తే. గీ.  నిన్ను చూచిన నవ్వుగా నున్నదయ్య -
         పాలు పితుగంగరాక తంటాలు పడుచు,
         పొదుగు ముట్టంగ గోవెట్టు లొదిగి యుండు
         చేపుటకు మున్ను తన్నదే చేయి పెట్ట.

తే. గీ.  సకల విద్యల నేర్చిన జాణ వీవు,
          పట్నమందున వసియించు పండితుడవు,
          యౌవనంబున నున్నట్టి అంగజుడవు,
          పాలు పితుక నేర ననుచు పలుక వేల?

తే. గీ.  చెలియ ఇటుల తన్నీసడించిననుగాని
         పడతి యుల్ల మెరుగని ఆ పల్లవుండు
         జాలిగొలిపెడు కళ్ళతో వ్రాలి తమిని,
         నామె నీక్షించె నమితమౌ ప్రేమతోడ. 

తే. గీ.  ఆశ వదలని యా పట్నవాసు చూచి
          కలికి పరిహసించంగ పక పక నవ్వె - 
          చెలసి వలలుని చేబడ్డ  సింహబలుని
          నాతి సైరంధ్రి హేళనన్ నవ్వినటుల. 

తే. గీ.  ఆమె నవ్వును చూడంగ నతని మోము
          కందగడ్డ యట్లెర్రగా కందిపోయి,   
          వనితపై మున్ను తనకున్న వాంఛ వీగి
          డంబు చెడి చూచె నా ‘డాంజువాను’. 

తే. గీ.  చిరిగిపోయిన బట్టలు సిగ్గునింప, 
         గాయములతోడ మంటెత్తి కాయమెల్ల 
         పడుచు, లేచుచు, కుంటుచు పడతి మోము
         వాసి తొఱగంగ చూచెనా ‘కేసినోవ’.

తే. గీ.  అతని  నీ రీతి గాంచి ఆ అతివ యనియె,
         "ఇంత జరిగిన కాని నీకేమి బుద్ధి
          రాక పోయె నేమందు - నీ రాక వలన
          కాలము గడిచె - మోదంబు కలిగె నాకు.

తే. గీ.   రెండు వేలేండ్ల క్రిందటి ప్రేమ కథల
           చదివి ఆ చమత్కృతులకు సంతసించ
           వలెను గాని వాటిని నేడు పట్టు విడక
           తలచి మోసపోరాదు రా! తమ్ముకుఱ్ఱ!  

ఉ.       కాలము మారె పూర్తిగను కామకలాప విలాస భూషలే
          స్త్రీలను మాట మానుడిక - శేముషి గల్గిన గొప్ప శక్తియై  
          ఏలుచునున్నవారు భువి, ఏ మగవానికి తీసిపోక, కా
          ర్యాలను నిర్వహించుటను, ఆతత విద్యల ధైర్య సంపదన్.

కం.   కళ్ళకు కట్టిన మాంద్యము
        భళ్ళున వీడగ యువకుడు పరితాపముతో
        త్రెళ్ళి తలచె నెరజాణలు
        పల్లెత లీనాడు పట్నవాసుల కంటెన్.

కం.   నక్కను తొక్కితి నని నే
       మక్కువతో తలచితి మును మా పల్లెక్కే
       తొక్కించె నావు చేతను
       మక్కెలు విరుగంగ నాకు మత్తు దిగంగా!

వివరణ: హాలుడు రమారమి 1వ శతాబ్దంలో ఆంధ్రదేశమేలిన శాతవాహన చక్రవర్తి. ఆయన “గాథా సప్తశతి”ని విరచించాడు. దీనిలోని ఒక గాథలో ప్రస్తుత ఖండికలోని 5వ పద్యంలో పిలిచిన విధంగానే ఒక యువతి బాటసారిని పిలుస్తుంది.  ఇలాంటి భావంగల శ్లోకం కాళిదాస ప్రణీతమనబడే “వసంతరాగం”లోకూడా వుంది.

*డాంజువాను, కేసినోవా అనేవారు కొన్నివందల యేళ్ళ క్రితం దక్షిణ యూరోపాకు చెందిన స్త్రీ లోలురు. మొదటివాడు కల్పిత పాత్ర అని, రెండవవాడు నిజమైన వ్యక్తియని ప్రతీతి.

సిలికానాంధ్ర వారి September, 2012 సుజనరంజని e-magazine పద్యం-హ్రిద్యం శీర్షికలొ ప్రచురితము.

శివ తాండవం

రచన: ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం.

భుజంగప్రయాత వృత్తమాలిక:

    భుజంగంబులే హారముల్ భూతసంఘం  
    బు జంగంబులున్ పంచ భూతంబులున్  పై
    తృజాలంబులున్ నాట్యబృందంబులై  శై
    లజార్ధంబుతో  నీవు  లంఘింపగా  అ
    ర్ధజైవాత్రకుం డాడ ధింధిక్క ధింధి
    క్క జాళ్వాల మద్దెళ్ళు కంపింపగన్  వి
    ష్ణుజా ధారలన్ ధాత్రి శోబిల్ల;  జేజే
    లజుండున్ ఘనశ్యామలాంగుండు సప్త
    ర్షి జంభారి సంఘంబు సేవింప నంద
    శు జోహారు భృంగీశు స్తోత్రంబు స్కంధే
    శు జేజేలు విఘ్నేశు శుండాల సౌస్వ
    ర్య జాత్యంపు  ఘీంకార మాకాశ సీమం
    దు జృంభింప సంసార దుఃఖఘ్న! శ్రీశై
    ల జామాత! నీ నాట్య లాస్యంబు శ్రీశై
    లజా మాత క్రీగంట లక్షించుచో  అం
    గజానంద  శృంగార కంజాక్షి యయ్యెన్;
    ప్రజాక్షేమ మోదంబు  ప్రాప్తించె - భూమా
    త  జంజాటముల్ మాన్పి ధర్తింపుమో దే
    వ! జోబిళ్ళు సేతున్! శివా! కృత్తివాసా! 
    అజస్రంబు నీ నామ మానంద కందం
    బు  జన్మంబు ధన్యంబు పూర్ణంబు  గాగా
    సజావై మనో నేత్ర సంయోగమౌ న
    ట్లు జోజో వరంబిమ్ము లోకేశ! ఈశా!
    అజేయా! మహేశా! మహా దేవ దేవా!

స్రగ్విణీ గర్భిత భుజంగప్రయాత వృత్తం:

      నమో దేవ దేవా! ఘనా దీనబంధూ!
      మమున్ కావ రావా! సమగ్ర ప్రభావా!
      తమిశ్రా వినాశా! సదా శాంతి దాతా!
      సమజ్ఞా వదాన్యా! అసాధ్య ప్రదానా!

(ఈ ఖండిక రచయిత విరచిత "రసస్రువు" కావ్యము లోనిది.)

సిలికానాంధ్ర వారి July, 2012 సుజనరంజని e-magazine పద్యం-హ్రిద్యం శీర్షికలొ ప్రచురితము.

సీతారాముల మంగళాశాసనం

రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం

సీతారాములు వారి కల్యాణ సమయంలో ఒకరిపై ఒకరు తలబ్రాలు పోసుకునే ఘట్టాన్ని బహుచమత్కార భరితంగా వర్ణించిన ఈ క్రింది శ్లోకాన్ని మన తెలుగువారు చాలామంది పెండ్లి పిలుపు పత్రికలపైన తెలుగు లిపిలో ముద్రింపించి తద్వారా తమ ఇంటి వధూవరులకు ఆ పురాణ దంపతుల మంగళాశాసనం పొందడం ఒక ఆచారంగా వస్తున్నది. ఐతే  సంస్కృతభాష పరిచయం లేని కారణంగా పెండ్లిపత్రిక  అందుకున్నవారిలో కొంతమంది ఈ శ్లోకాన్ని చదివినా, దానిలోని అందచందాలను ఆస్వాదించే సావకాశం తక్కువగానే వుంటుంది.

సంస్కృతభాష నేర్వని తెలుగు వారికి ఈ శ్లోకంలో పాదపాదానికి ఎదురయ్యే చమత్కారాలను దృష్టికి తెచ్చే ఆశయంతో, దీనిని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసి పాఠకుల ముందుంచుతున్నాను. అంతేగాక ఈ "మంజరీ ద్విపద" ఛందస్సులో సాగిన ఈ గీతిక పాడుకొనుటకూ,  పెండ్లి పత్రికలలో ముద్రించుకొనుటకూ ఉపయోగ పడునని నా అభిప్రాయం. దీనిని చదివి ఆనందించుడని "సుజన రంజని" పాఠకులకు మనవి.

శ్లో||     జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః
         న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః
         స్రస్తాశ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః
         ముక్తాస్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః 

పై శ్లోకానికి స్వేచ్ఛానువాదం

మంజరీ ద్విపద:       

శ్రీరాము నానాడు సీతమ్మ తల్లి
ఆనందముగ పెండ్లి ఆడేటి వేళ, 
తలబ్రాలు పోయంగ తనరి దోసిటను
తెల్లన్ని ముత్యాలు తీపార గొనగ,
ఎఱుపు తామరలట్టి అఱచేతులందు
ముదముతో జనులెల్ల ముగ్థులై చూడ,
ముత్యాలు యెఱ్ఱనై  మురిపాలు జిమ్మె,
కెంపులై దానిమ్మ గింజలో యనగ -

సిగ్గుతో తలవంచి సీతమ్మ తలరి, 
తలబ్రాలు రామయ్య తలపైన బోయ,
నిజవర్ణ భరితమై నెగడి ముత్యాలు
తెల్లగా కనుపట్టె మల్లెలో యనగ -

నీలమేఘము వోలె నెనయు రాఘవుని
మేనిపై ముత్యాలు మెండుగా దొర్లి
ఇంద్రనీలాలట్లు ఇంపుగా మెఱసె
నిండార పండిన నేరేళ్ళ వలెను -

ఇన్నిరంగులు చూచి ఇంతి యుప్పొంగె,
చిన్నగా నవ్వాడు శ్రీరాము డపుడు -  
ఆరీతి రంజిల్లు అపురూప యుగళి,
దీవించుగాక మా వధూవరుల.


సిలికానాంధ్ర వారి June, 2012 సుజనరంజని e-magazine కవితా స్రవంతి శీర్షికలొ ప్రచురితము.

శివ పరివారం

రచన: శ్రీమతి వేము  లక్ష్మీకాంతమ్మగారు

సీ.        సింహనాదము విని చెంత నున్నటి గిత్త
           శరణన్న చందాన చేరి కొలువ,
           వ్యాఘ్రచర్మము గప్ప వైరమున్ దలచు నా
           హరిణికి అభయ మిచ్చు రీతి దనర,
           శిఖి నిస్వనంబుచే చిలువలు భయముతో
           జిహ్వలు చెదరంగ జేరి యాడ, 
           భుజగముల్ బుసగొట్ట భూరి విభ్రాంతిమై
           ఒకప్రక్క మూషిక మొదిగి యుండ

ఆ.వె.   భూతముల గాంచి భయపడు పార్వతి 
           కర్థదేహమిచ్చి యాదరించు
           చంద్రమౌళి యిచ్చు సౌభాగ్యముల్ మాకు
           శౌరి సుతను గూడి శాశ్వతముగ.

(ఈ పద్యము సుమారు 1920-25 మధ్యకాలంలో తమ ఇంట్లోకి వచ్చిన శివుడు, పరివారం చిత్రపటము
చూచి  మా ఆమ్మగారైన వేము లక్ష్మీకాంతమ్మగారు  [భారతాల సీతగారి నాయనమ్మగారు] రచించినది)
పంపినవారు: ఆచార్య వి. యెల్. యెస్. భీమశంకరం.

నెచ్చెలి

రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం
(ఉత్పల మాల మాలిక)

నచ్చిన వంటకమ్ము పచనంబొనరించి భుజింప జేయు, ని
క్కచ్చిగ తీర్చి దిద్దు గృహకార్యములన్నియు, భర్తయున్
మెచ్చెడి రీతి వర్తిలి అమేయ సుఖంబుల యందు దేల్చు, పై
పెచ్చున రూపవంతులగు పిల్లల పాపల గాంచి వారలన్
మచ్చిక పెంచి బుద్ధులను మానుగ నేర్పును, అత్త మామలన్
తచ్చనలేక కొల్చు, నిరతమ్మును వచ్చెడి బంధు మిత్రులన్
అచ్చిక బుచ్చికంబుల మహా పరితోషము గూర్చు, క్రోధుడై
వచ్చిన భర్తకున్ తగిన రీతిని కోపమడంచు, నాథుడున్
తెచ్చిన తేకపోయినను తీరుగ దిద్దు గృహంబు, దైవమున్
నిచ్చలు పూజచేసి మగనిన్ కృప జూడగ గోరు, అట్టి మీ
నెచ్చెలి కే మొసంగినను నీగునె ఆమె ఋణమ్ము - అందుచే
వచ్చెడి జన్మలో తగిన భార్యయి సేవ లొనర్పగా దగున్.

5, మే 2012, శనివారం

నందన వసంత శోభ

నందన వసంత శోభ
రచన: ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం.

చ. తెల తెల వారుచుండె, మది తీయని స్వప్నము తోడ నిండె, నే
నల ‘ఖర’ నామ వత్సరికి హారతులిచ్చుచు వీడు కొల్పుచున్,
తులుచన లేచి చెంత గల తొటకు నేగితి దైవపూజకై
నలరులు కోయగా - నట నబ్బురమొప్పగ ప్రస్ఫురిల్లె క
న్నులు మిరుమిట్లు గొల్పగ వినూతన దృశ్యము లొక్కపెట్టునన్.

తే.గీ. అపుడె ఉదయించు నాదిత్యు నరుణకాంతి
కొలది కొలదిగ దిక్కులన్నియును కవిసి
నేల తల్లికి పారాణి నిమిరెననగ,
ప్రకృతి కాంత కనబడె నవ వధువు వోలె.

తే.గీ. మొల్ల, సంపంగె, తంగేడు, పొగడ, మల్లె
మొల్లముల నుండి బహువర్ణ పుష్పవృష్టి
నింగి హరివిల్లు నేలకు వంగుచుండె
ననగ నానంద పరచె నా మనము నందు.

తే.గీ. మొన్న మొన్నటి అవనతాంబురుహ కుట్మ
లాంగనలు ఫుల్లమై లేచి భృంగ తతికి
నధర మకరంద నిష్యంద మధురములగు
చెఱుకు విలుతు లకోరీల బఱపె నపుడు.

తే.గీ. రంగు రంగుల పువ్వుల రంగశాల,
రంగశాలను నర్తించు భృంగచయము
లింపుగా తోచె కమనీయ దృశ్యముగను
హోలి యాడెడు రంగారు యువత వోలె.

తే.గీ. పిల్ల గాలికి పూబాల ప్రేంకణములు,
ప్రేంకణంబుల చెలరేగి ప్రీతిగొల్పు
సరస పరిమళ సుమగంధ సౌరభంబు
లపుడు ప్రకటించె నవ వసంతాగమమ్ము.

మధుమతి:
వనము చూడగ నా
మనము సంతసిలెన్
తనువు ఝల్లుమనెన్
కనుల పండువయెన్.

తురగవల్గన రగడ:
ఆమని సొగసుల వఱలిన ఆ వని నయ సోయగములు
కామకళా కుసుమ మధుర గంధ సాయకములు,
కూజిత గానములు భ్రాంతి గొలుపు హృదయ మోదకములు
వీజిత మృదు శీకరములు, ప్రేమికజన రంజకములు.

నవమయూరము:
విప్పినవి పింఛములు విందులను సేయన్,
కప్పినవి భూతలము కన్నులకు హాయై
త్రిప్పినవి కంఠములు తీరుపులతోడన్,
ఒప్పినవి ఆ వనమయూరములు ప్రీతిన్.

కుసుమ విచిత్రము:
వనమున పూవుల్ వలపుల జూపన్
ఘనముగ చెట్లన్ కలయగ పూచెన్
మనమున ప్రీతై మమతల నింపెన్
కనగను హాయై తనువు తలర్చెన్.

నవనవలాడెన్ నవ వనమంతన్
అవని సరాగం బాకృతి దాల్చెన్
కవనము చెప్పెన్ కలువల కన్నెల్
యువకుల డెందా లోటమి పొందెన్.

భ్రమర విలసితము:
సంజన్ కాంచంగ స్మరుని శరముల్
జంజాటంబుల్ విసరెను హృదులన్,
మంజిష్టంబౌ సుమసముదయముల్
రంజిల్లన్ జేసె రసిక యువతన్.

కనక లత:
అలరు విలతుని కుసుమ శర హరువుల విరసమునన్
కెలవున చిలుకలు జతలై కిలకిలమని కులికెన్
కలువలు తలకెను నటు నిటు కలపడి విరహమునన్
నలిగొని యువకుల మనములు నలువుగ కలుచవడెన్.

ఉ . ఏమిది నేడు భూమి వసియించెడు స్థావర జంగమ వ్రజం
బామని శోభ దేలుచు సుఖాయుత దివ్య మనోజ్ఞ నాట్య గీ
తామృత మాస్వదించుటకునై మది నీ విధి నిశ్చితార్థులై
కామనతో వసంత సభ కాముని పండువుగా రచించిరో!

తే.గీ. సురభి పొంగారు ఆమని శోభ కనగ,
పృథివి చిగురించి మకరంద మధువు కురిసి
నట్టు లనిపించి నా మస్సనంత నిండె
తేనె తరగల అనుభూతి దివ్యముగను.

తే.గీ. దివ్యమయిన ఆ అనుభూతి తీరు చూడ
భవ్య నూతన ‘నందన’ వత్సరంబు
మనల కాయురారోగ్య కామ్యముల నిచ్చి
బ్రోచు నను ఆశ మనమున తోచె నాకు.

21, ఏప్రిల్ 2012, శనివారం

భీమ శతకం


భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(ఎనిమిదవ విడత)
71. కవిత లల్ల వచ్చు, ఘన కీర్తి గొన వచ్చు,
పేరు వచ్చి విలువ పెరుగ వచ్చు,
విర్రవీగ రాదు విబుధుడౌ కవిరాజు -
విమల సుగుణ ధామ వేము భీమ.

72. కవిత చెలగ వలయు కత్తివలె సమాజ
మలిన మెపుడు, సర్జనుల కఱకగు
స్కాలపెల్లు చెడిన కండ కోయు విధాన-
విమల సుగుణ ధామ వేము భీమ.

73. పద్య మెపుడు గూడహృద్యంబుగా నుండి
గొప్ప భావ మొకటి చెప్పవలయు,
కాని యెడల చూడ గద్యమే మేల్గాదె!
విమల సుగుణ ధామ వేము భీమ.

74. మెప్పు కొఱకు గాకగుప్పెడు తృప్తికై
కవిత వ్రాయు వారు కవులు భువిని -
కోరకున్న కూడ కూయదే కోకిల?
విమల సుగుణ ధామ వేము భీమ.

75. ఇల్లనంగ వసతి గృహముమాత్రమె కాదు,
వలపు చూర గొన్నవారి గూడి
నిచ్చలు బ్రదుకగల స్వేచ్ఛాప్రదేశంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.

76. ప్రేమయన్న నీవుప్రేమించు వారితో
పూర్ణ సంగమమ్ము, మోస మెఱుగ
నట్టి స్వార్థ రహితమైన తాదాత్మంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.

77. మగని పైన ప్రేమ, మమతానురాగమ్ము,
కలిసి మెలిసి బ్రదుకు కాంక్షయున్న
సాధ్వి నిర్వచనమ్ము సహధర్మచారిణి -
విమల సుగుణ ధామ వేము భీమ.

78. భార్యపైన ప్రేమ వాంచతో ముడివడు,
పిల్ల వాని పైన వృద్ధి కొఱకు,
తనయ పైన ప్రేమ ధరలోన సహజంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.

79. కుదురు లోని నారు ముదిరిన విడదీసి
వేరు చోట్ల నాట వృద్ధి పొందు -
పెరిగి నట్టి సుతులు విడిపోవుటయునట్లె
విమల సుగుణ ధామ వేము భీమ.

80. భార్య తోడ పిల్ల పాపల తోడను
కలసి అనుభవింప నలవి గాని
భాగ్య మెవరి కైన భాగ్య మెట్లౌనురా!
విమల సుగుణ ధామ వేము భీమ.

26, మార్చి 2012, సోమవారం

భీమ శతకం

భీమ శతకం

రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

(ఏడవ విడత)

61. బ్రదుకు వ్యథలు క్రమ్మి బరువెక్క నీ బుర్ర,

ఇల్లు వదలి బైట కెళ్ళి చూడు,

ఎన్నిరెట్లు బాధ లున్నవో ధర లోన -

విమల సుగుణ ధామ వేము భీమ.

62. ఎండమావుల కొఱ కెందుకీ పరుగులు?

సుంత ఆగి శ్రమ నొకింత మఱువ

చుట్టు నున్న ప్రకృతి శోభను వీక్షించు!

విమల సుగుణ ధామ వేము భీమ.

63. ఉదయమందు లేచి ఉద్యానవన మేగి,

సుంత విచ్చి నట్టి సుమము చూడ,

కలుగు సంతసమ్ము తెలుపంగ తరమౌనె!

విమల సుగుణ ధామ వేము భీమ.

64. ముళ్ళమొక్క పీకి, పూలమొక్కను పెంచు,

మత్సరమ్ము నణచి మంచి పెంచు,

మంచి కన్న జగతి మించిన దేదిరా!

విమల సుగుణ ధామ వేము భీమ.

65. కలతతోడ మనసు కలగి కృశించిన,

విత్తి ఒక్క పూల విత్తనమ్ము,

పూయ బోవు పూల ముదముతో నూహించు -

విమల సుగుణ ధామ వేము భీమ.

66. పూయవచ్చు నొక్క పూవు నా తోటలో,

ఆదియె మదిని హాయి గూర్చు నాకు,

మంచి మిత్రుడొకడు పంచ నున్నట్లుగా -

విమల సుగుణ ధామ వేము భీమ.

67. చిత్తమందు నీవు చెత్తను పెంచకు,

తుడిచి వేయు మయ్య అడప తడప,

అద్దమంటి మనసు ఆరోగ్యమై యొప్పు -

విమల సుగుణ ధామ వేము భీమ.

68. అప్పుడప్పుడు మన కానంద మొదవిన

చెప్ప లేము నోరు విప్పి దాని,

అట్టి దాని నెఱుగు డనుభూతి యను పేర -

విమల సుగుణ ధామ వేము భీమ.

69. చిన్న కోర్కె తీర చెప్ప లేనంతగా

కలుగు సంతసమ్ము ఘనముగాను -

అవని లోని మనుజు డల్ప సంతొషిరా!

విమల సుగుణ ధామ వేము భీమ.

70. మంచి పాట విన్న మనసులో స్పందన

చెప్ప వలయు - కాక చెప్పకున్న

మూగ చెవిటి వారి ముచ్చటవలె నుండు -

విమల సుగుణ ధామ వేము భీమ.

4, ఫిబ్రవరి 2012, శనివారం

భీమ శతకం

భీమ శతకం

రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

(ఆరవ విడత)

51. విరియు సుమము బోలు గురుముఖమ్మున నుండి

విద్య యనెడు సుధను పీల్చునట్టి

తిమిర పూర జగతి దివ్వెయే విద్యార్థి -

విమల సుగుణ ధామ వేము భీమ.


52. దివ్వె తగులజేసి దివ్వెలెన్నైనను

వెలుగజేయవచ్చు సులువు గాను,

జ్ఞాన మిట్లె మనకు జగతిలో వ్యాపించు -

విమల సుగుణ ధామ వేము భీమ.


53. బ్రదుకు తెరువు కొఱకు చదువుకోవలె నీవు

అంత కన్న లబ్థి యెంతొ కలదు,

చదువుతోడ గొప్ప సంస్కార మేర్పడు -

విమల సుగుణ ధామ వేము భీమ.


54. బాహు బలము పెరుగు వ్యాయామముల తోడ,

బుద్ధి బలము పెరుగు విద్దె తోడ,

కండ కలిగి బుద్ధి కలవాడె మొనగాడు -

విమల సుగుణ ధామ వేము భీమ.


55. ప్రజ్ఞతోడ విద్య పణముగా పెట్టిన,

చేరవచ్చు భాగ్య శిఖరములను,

అడ్డులేదు దీని కావంత ధరలోన -

విమల సుగుణ ధామ వేము భీమ.


56. చిన్నతనము నందు స్నేహముల్ ముడివడు,

యెదిగి నపుడు గాని ముదిమి నైన,

మఱవ తరమె మిత్ర దరహాస దీప్తులు,

విమల సుగుణ ధామ వేము భీమ.


57. చదువుకొనెడు నాడు సాగును స్నేహంబు,

పేద గొప్ప యనక బింక మగుచు,

వృత్తిలోని మైత్రి ఉత్తుత్తిదే సుమ్ము!

విమల సుగుణ ధామ వేము భీమ.


58. మరగి మరగి పాలు మంటలో పడబోవ,

నీరుచేర్చ తిరిగి నిలిచి కాగు -

ఇలను మంచి స్నేహ మీ రీతి నుండురా!

విమల సుగుణ ధామ వేము భీమ.


59. కుటిల జనుడు పొగుడు గొప్పగా నీ ముందు

నీవు లేని తరిని నింద జేయు,

అట్టివాని నమ్ము టవివేకమేగదా!

విమల సుగుణ ధామ వేము భీమ.


60. ధర్మతత్పరతయు, దాక్షిణ్యమును లేని

బ్రదుకు బ్రతుక నేల పశువు వోలె?

బుద్బుదంబు గాదె భువిలోన మన జన్మ -

విమల సుగుణ ధామ వేము భీమ.